Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నేలకొండపల్లి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించి తమ స్వార్థం కోసం ప్రజలను నిత్యం భ్రమలలో ముంచుతూ పబ్బం గడుపుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ విమర్శించారు. సోమవారం రాత్రి మండలంలోని కోరట్లగూడెం గ్రామంలో పార్టీ గ్రామ శాఖ జనరల్ బాడీ సమావేశం గాదె వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. తొలుత గ్రామంలోని ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బండి రమేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు విస్మరించిన ఎమ్మెల్యేలు, మంత్రులు వివిధ సంక్షేమ పథకాలు సహాయం పేరుతో ప్రజలకు తాత్కాలిక ఉపశమన చర్యలు చేపడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. డబ్బు రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తిరిగి ఎన్నికల్లో గెలిచేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. డబ్బు రాజకీయాలు శాశ్వతం కావని చట్టసభలలో కమ్యూనిస్టులు లేని లోటుని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. చట్టసభలలో సరైన సంఖ్యలో కమ్యూనిస్టులు లేకపోవడం వల్లనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులను, రైతు వ్యవస్థను నిర్వీర్యం చేసే దుర్మార్గమైన నల్ల చట్టాలను తీసుకు వచ్చిందన్నారు. అందుకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా సుదీర్ఘంగా జరిపిన రైతు ఉద్యమం భవిష్యత్తులో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే అనేక పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా యువత మధ్య స్నేహసంబధాలను, మత సామరస్యాన్ని పెంపొందించేలా గ్రామాల్లో కబడ్డీ, ముగ్గులు పోటీలు, ఇతర సాంస్కతిక కార్యక్రమాలను డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి, పగిడికత్తుల నాగేశ్వరరావు, బెల్లం లక్ష్మి, డేగల వెంకటేశ్వరరావు, శాఖా కార్యదర్శి షేక్ లాల్ పాష, గురుజాల ఉపేందర్, ఉప సర్పంచ్ వాసంశెట్టి నాగేశ్వరరావు, చల్లగుండ రమేష్, గురజాల వెంకటేశ్వర్లు, సత్యాల తిరుపతిరావు, షేక్ రియాజ్, వెంకట్రావమ్మ, ఉమా పాల్గొన్నారు.