Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పశువులను తప్పించబోయి ప్రమాదం
అ ఇద్దరికి తీవ్రగాయాలు,
10 మందికి స్వల్పగాయాలు
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
జాతీయ రహదారిపై పశువులను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకువెళ్లిన సంఘటన బూర్గంపాడు మండల పరిధిలోని మర్రికుంట గ్రామసమీపంలో గురువారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్04 యూడీ 1026) మణుగూరు నుంచి ఖమ్మం వైపు వెళుతోంది. ఈ క్రమంలో మర్రికుంట గ్రామసమీపంలోకి రాగానే ఎదురుగా రోడ్డుపై ఉన్న పశువులను తప్పించే క్రమంలో ఈ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కంది చేనులోకి దూసుకు పోయింది. ఈ ఆర్టీసీ బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉండగా అందులో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. అలాగే మరో 10 మంది ప్రయాణీకులు స్వల్పంగా గాయ పడ్డారు. సమాచారం అందుకున్న బూర్గంపాడు ఎస్సై సముద్రాల జితేందర్ హుటాహుటీన తన సిబ్బందితో అక్కడకు చేరుకుని గ్రామస్థుల సహాయంతో గాయపడిన వారిని సమీపంలోని మోరంపల్లిబంజర పీహెచ్సీకి తరలించి ప్రథమచికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఈ మేరకు బూర్గంపాడు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.