Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం సీపీఐ(ఎం) జిల్లా ద్వితీయ మహాసభలు ఆశ్వరావు పేటలో 2022 జనవరి 4, 5 తేదీలలో జరుగుతాయని, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రకటించారు. మంచికంటి భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్, గుగులోతు ధర్మతో కలిసి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సమస్యల సాధన కోసం మిలిటెంట్ పోరాటాలు నిర్వహించామన్నారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, ఆర్టీసీ సమ్మె, కార్మికుల సమ్మె సందర్భంగా జరిగిన మహోత్తర పోరాటాలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించామన్నారు. సీపీఐ(ఎం) జాతీయ నాయకులు బృందా కారత్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రత్యక్ష పోరాటాలకి నాయకత్వం వహించిన తీరు అద్భుతం అన్నారు.
మహిళ హక్కులకోసం, మైనార్టీలపై ప్రభుత్వ మతపరమైన దాడులను నిరసిస్తూ సమైక్య నినాదంతో ప్రత్యక్ష కార్యాచరణలు, కార్మిక, రైతాంగ పోరాటాలు, సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో కీలక మైన ఉద్యమాలు నిర్వహించామన్నారు. సాగునీటి ప్రాజెక్టు కోసం పాదయాత్రలు, నిర్వహించి జిల్లా ప్రజల సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా ప్రయత్నం చేశామని అన్నారు. వాటి పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఈ మహాసభలలో చర్చించ బోతున్నట్లు తెలిపారు.
ఇవే కాక ప్రజాసేవ కార్యక్రమాల్లో మానవత్వాన్ని చాటిన అనేక సేవ కార్యక్రమాలూ చేసిన ఘనత సీపీఐ(ఎం)కే దక్కిందన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వాలు చేయలేని పనులు పార్టీ కార్యకర్తలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోవిడ్‌తో బాధ పడిన వారికి ఐసోలేషన్ సెంటర్లు, కరోనా పేషెంట్లకు భోజనాలు, మృత దేహాలకు దహణ సంస్కారాలు వంటి సాహసోపేత మైన సేవ కార్యక్రమాలు ప్రత్యక్షంగా నిర్వహించడం జరిగిందన్నారు.
ప్రజా పోరాటాలతో, సేవా కార్యక్రమాల ద్వారా సీపీఐ(ఎం) మన జిల్లాలో మరింత నిర్ణయాత్మక పాత్ర పోషించేలా ఈ మహాసభలలో చర్చించబొతున్నట్లు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో పట్టణ నాయకులు భుక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.