Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఇటీవల రామకృష్ణ కుటుంబం చేసుకున్న ఆత్మహత్యలకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనమా రాఘవేంద్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ అధికార పార్టీలో ఉన్న తన తండ్రి పదవిని, పార్టీని అడ్డం పెట్టుకొని, పోలీసు అధికారులను తనకు అనుకూలంగా మల్చుకొని గత 15 ఏండ్లుగా అమాయక ప్రజలను బెదిరించటం, వేధించటం, సెటిల్మెంట్ చేయడం, మహిళలను లొంగదీసుకోవడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడని ఆయన తెలిపారు. రామకృష్ణ కుటుంబం యావత్తూ రాఘవేంద్ర వేధింపుల వల్లనే ఆత్మహత్యలకు పాల్పడిందన్నది స్పష్టం. నిస్సుగ్గుగా అనేక దారుణాలకు పాల్పడుతున్న రాఘవేంద్రను పోలీసులు అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. తక్షణమే రాఘవేంద్రపై రౌడీషీట్ ఓపెన్ చేయడంతోపాటు కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాఘవేంద్ర వేధింపుల వల్ల కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇటీవల రామకృష్ణ కుటుంబం యొక్క ఆస్తుల పంపకాల్లో కూడా తలదూర్చి భార్యను హైద్రాబాద్ తీసుకొస్తేనే ఆస్తుల సమస్య పరిష్కారం అవుతుందని, లేదంటే ఆస్తులు కూడా దక్కఉండా చేస్తానని రామకృష్ణను బెదిరించాడని, ఈ అవమానాన్ని భరించలేక రామకృష్ణ భార్య, కూతుళ్ళు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని, వారి మరణ వాంగ్మూలం తేటతెల్లం చేస్తున్నదన్నారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, కుమారుడు చేస్తున్న దుశ్చర్యలన్నింటికి శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావే పూర్తి బాధ్యత వహించాలని నున్నా డిమాండ్ చేశారు. ఇలాంటి పనులు చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ధ్వజ మెత్తారు. ఇంతకు ముందు కూడా కొందరు ఇతని వల్ల బాధలు పడి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలతో ఎమ్మెల్యే కొడుకు ఇలా చేయడం భావ్యం కాదని, ఇంతకుముందు ఆయనపై నమోదైన కేసులు విచారణ జరిపించి, రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబం చావులకు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, కొండబోయిన నాగేశ్వరరావు, ఎం.ఎ.జబ్బార్, చలమల విఠల్, తాళ్ళపల్లి కృష్ణ, పిన్నింటి రమ్య, సుంకర సుధాకర్, ఆర్.ప్రకాష్, జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, చింతల రమేష్, తూశాకుల లింగయ్య, పి. నాగసులోచన, బేగం, అజిత, సరస్వతి, కుటుంబరావు, బోడపట్ల సుదర్శన్, కె. అమరావతి, రమ తదితరులు పాల్గొన్నారు.