Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపాలెం
మండల పరిధిలో పాపటపల్లి చెందిన కౌలు గిరిజన మిర్చి రైతు భూక్యా సోమ్లా వైరస్ తెగులుతో దెబ్బతిన్న మిర్చి పంట...మరోవైపు అప్పుల బాధ భరించలేక... ప్రభుత్వం సహాయం అందక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ రైతు సంఘం, ఎల్హెచ్పిఎస్ సంఘాల జిల్లా నేతలు శనివారం పాపటపల్లి వారి స్వగ్రామం వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం, మాదినేని రమేష్‌లు మాట్లాడుతూ... తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మంత్రి అజరు కుమార్ జోక్యం చేసుకొని వారి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందించి జిల్లాలో మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో మిర్చి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వెంటనే ప్రభుత్వం మిర్చి రైతులకు అనుకూలంగా ప్రకటన చేసి ఎకరానికి లక్ష రూపాయల సహాయం అందించే విధంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆత్మహత్యలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు పరామర్శించిన వారిలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి భూక్యా కృష్ణ, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బానోత్ మోతిలాల్, అజ్మేరా సుశీల, భూక్యా శ్రీనివాస్ నాయక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.