Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ ప్రాంతానికి చెందిన మండిగ నాగరామకృష్ణ (40) కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావును పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. రాత్రి ఆయన్ను విచారించారు. శనివారం ఉదయం పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ విలేకరులకు కేసు వివరాలను వెల్లడించారు. రాఘవతో పాటు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ ఒప్పుకున్నారని వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితుల్లో ఒకరు (రామకృష్ణ) మరణించగా నలుగురు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు రాఘవను శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం.నీలిమ ఇంటికి తీసుకు వచ్చారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో జడ్జి ఎదుట హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు రాఘవను భద్రాచలం సబ్‌జైల్‌కు తరలించారు. అక్కడ ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 985 కేటాయించారు. జైలులో ఒకటో నంబర్ బ్యారక్‌కు తరలించారు. ఇవీ క్లుప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఈ కేసులో చోటుచేసుకున్న పరిణామాలు.
- ఆ సంబంధంతోనే అక్కకు రాఘవ అండ...
రాఘవను అరెస్టు చేసిన కొద్దిసేపటి తర్వాత నాగరామకృష్ణ సెల్ఫీ వీడియో మరొకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో ఆయన అక్క కొమ్మిశెట్టి మాధవితో రాఘవకు వివాహేతర సంబంధం ఉందని రామకృష్ణ వెల్లడించారు. 11 నిమిషాల నిడివితో కూడిన ఈ వీడియోలో తనను నమ్మి అప్పులిచ్చిన వారికి ఒక్క రూపాయి తగ్గించకుండా తన వాటా నుంచి చెల్లించాలని కోరారు. మిగిలిన ఆస్తిని తన అక్క, తల్లినే ఉంచుకోమని కూడా చెప్పారు. తన తండ్రి ద్వారా తనకు రావాల్సిన ఆస్తిని సంవత్సరం నుంచి పెండింగ్ పెట్టి రాఘవతో కలిసి తన అక్క, అమ్మ ఇద్దరూ తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తన ఆర్థిక స్థితిగతులు, తన అక్క ఆర్థిక, కుటుంబ పరిస్థితులను వివరించారు. రాఘవతో తనకున్న వివాహేతర సంబంధం గురించి అనుమానాలను నివృత్తి చేస్తూ వివరణ కూడా ఇచ్చారు. తన కుటుంబ, ఆర్థిక వ్యవహారాలన్నింటిలోనూ రాఘవ తలదూర్చుతున్న విధానాన్ని తెలిపారు. రాఘవ కుటుంబ సామూహిక ఆత్మహత్య తర్వాత పోలీసులు రెండు సెల్ఫోన్లు, 7 పేజీల మరణ వాగ్మూలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిలోని ఓ సెల్ఫోన్లో తన కుటుంబ ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ రామకృష్ణ 38 నిమిషాల నిడివితో ముందస్తు సెల్ఫీ వీడియోను తన కారులో కూర్చొని చిత్రీకరించారు. దానిలో 8 నిమిషాల నిడివి, 11.25 నిమిషాల నిడివితో కూడిన రెండు వీడియోలు ఇప్పటికే వెలుగు చూశాయి. మిగిలిన వీడియోలో ఏముందనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- ఆరోపణలను ఖండించిన అక్క...రాఘవను వెనుకేసుకొచ్చిన తల్లి
తనపై తమ్ముడు చేసిన ఆరోపణలను రామకృష్ణ సోదరి లోగ మాధవి ఖండించారు. ' ఆస్తుల పంపకాల విషయంలో వనమా రాఘవను కలిశాం. కానీ ఆయన ఏం మాట్లాడారో మా తమ్ముడికే తెలుసు. మాతో చెబితే పరిష్కార మార్గం ఆలోచించే వాళ్లం. మా తమ్ముడు అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చి మిగిలిన ఆస్తులు పంచుకోవాలనుకున్నాం. కానీ సాధ్యపడలేదు. మా నాన్న ఉన్నప్పటి నుంచే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంబంతో మాకు పరిచయం. ఆస్తుల పంపకాలు కూడా నాలుగైదు రోజుల్లో సెటిలయ్యేవి...కానీ ఇంతలోనే ఇలా జరిగింది.' అని చెప్పుకొచ్చారు. రాఘవ తల్లి సూర్యావతి మాత్రం రాఘవను వెనుకేసుకొస్తు మాట్లాడకొచ్చారు. కావాలనే ఎవరో ఈ కేసులో రాఘవను ఇరికిస్తున్నారని, తన కుమారున్ని ఎవరో ప్రేరేపించి తప్పుదోవ పట్టించి చావుకు కారణమయ్యారన్నారు.
- బలమైన కారణంతోనే బలవన్మరణం
బలమైన కారణంతోనే తన బావ కుటుంబ సమేతంగా బలవన్మరణానికి పాల్పడ్డారని రామకృష్ణ బావమరిది జనార్దన్ వాపోయారు. కొత్తగూడెంలో ఉన్న జనార్దన్ కుటుంబాన్ని 5వ తేదీన కొందరు బెదిరించినట్లు తెలిపారు 'నవతెలంగాణ' మాట్లాడగా అనేక విషయాలను వెల్లడించారు. ''అక్క శ్రీలక్ష్మి, బావ రామకృష్ణ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పిల్లలను కూడా ఎంతో బాగా చూసుకునేవారు. రూ.కోట్ల ఆస్తులున్న వారికి రూ.50లక్షల అప్పు ఓ లెక్కకాదు. బావను బాగా భయపెట్టడంతోనే ఈ అఘాయిత్యానికిఒడిగట్టి ఉంటారు. ఇప్పుడు రాజమండ్రిలో మాకు దగ్గరోలోనే ఇల్లు అద్దెకుతీసుకుని ఉంటున్నారు. డిసెంబర్ 30వ తేదీన సెటిల్మెంట్ అయిపోయిందని బావ గారు చెప్పారు. ఇక ఎలాంటి ఇబ్బందులు లేవు. పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు అన్నారు. పాల్వంచ నుంచి ఫోన్ వచ్చిందని జనవరి 2వ తేదీ ఉదయం అక్క, పిల్లలతో కలిసి ఇక్కడకు వచ్చారు. ఆ ఫోన్ ఎవరు చేశారో? ఏమన్నారో? మాత్రం తెలియదు. పోలీసులు కూడా మాకు ఫోన్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బావ బీకాం డిగ్రీ పూర్తి చేశారు. అక్క ఇంటర్మీడియెట్ చదివారు. పిల్లలు రాజమండ్రిలో హాస్టల్లో ఉండేవారు. దగ్గరుండి పిల్లలను చదివించుకుందామని అక్కడికి వచ్చారు. వ్యాపార లావాదేవీల నిమిత్తం అప్పుడప్పుడు పాల్వంచ వచ్చి ఉండి పనిచూసుకుని వచ్చేవారు. మూడు రోజులు నా మేనకొడలు కాలిన గాయాలతో అవస్థ పడుతుంటే ఒక్కరోజు కూడా మా అత్త (సూర్యావతి) రాలేదు. అదే సమయంలో కొందరు హాస్పిటల్‌కు వచ్చి ''జరిగిందేదో జరిగింది. ఏదైనా ఉంటే సెటిల్ చేసుకుందాం. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.'' అంటూ బెదిరించినట్లు మాట్లాడారు.'' అని రామకృష్ణ బావ మరిది జనార్దన్, అత్త రమాదేవి కన్నీటిపర్యంతమయ్యారు. సీఎం స్పందించి నిందితులపై కఠినంగా చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. మరోవైపు నలుగురి బలవన్మరణాలకు కారకులను వెంటనే శిక్షించాలని శ్రీలక్ష్మి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం గ్రామస్తులు శనివారం ర్యాలీ నిర్వహించారు. 'మా ఊరు ఆడపడుచు శ్రీలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని' కోరారు.
- కట్టుదిట్టమైన భద్రత
రాఘవను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పాల్వంచ టౌన్ పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశం అనంతరం ఏఎస్పీ రోహిత్‌రాజ్, సీఐ సత్యనారాయణ, ఎస్సై రెడ్డీష్ రాఘవను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు కొత్తగూడెం తీసుకొచ్చారు. విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలో జ్యోతి అనే రాఘవ బాధితురాలు కొద్దిసేపు నినాదాలు చేసింది. యువతరం పార్టీ ఆధ్వర్యంలో కొందరు పోలీసుస్టేషన్ వద్ద నిరసన తెలిపారు. మార్గమధ్యంలో బీజేపీ, మరికొందరు కార్యకర్తలు అడ్డుతగిలారు. కొత్తగూడెంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకోకుండా భద్రత చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కొత్తగూడెం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం.నీలిమ ఎదుట రాఘవను హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. భద్రాచలం సబ్‌జైల్‌కు తరలించారు.