Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాఘవ అంగీకరించినట్లు ఏఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడి
- 8 మంది నిందితులు... ముగ్గురి అరెస్టు.. నలుగురు పరారీ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ ఎదుట సొంత నివాసగృహంలో ఈ నెల 3న కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నాగరామకృష్ణను బెదిరించినట్లు వనమా రాఘవేంద్రరావు అంగీకరించాడని పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. పాల్వంచ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు. '' ఈనెల 3న నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి తానూ నిప్పంటించుకున్నారు. ఘటనాస్థలిలో రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, చిన్నకూతురు సాహిత్య చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్దకుమార్తె సాహితీ 5వ తేదీ ఉదయం 6 గంటలకు మృతిచెందింది. 3వ తేదీన రామకృష్ణ బావమరిది జనార్దన్ ఫిర్యాదుతో పాల్వంచ పీఎస్‌లో కేసు నమోదు చేశాం. ఐపీసీ 302, 307, 306 సెక్షన్ల కింద కేసు పెట్టాం. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో రాఘవపై ఆరోపణలో చేశారు. ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఇతర కారణాలున్నాయని వీడియోలో తెలిపారు. రాఘవతో పాటు తల్లి సూర్యవతి, అక్క లోగ మాధవి కారణంగానే చనిపోతున్నట్లు వివరించారు.'' ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాల ద్వారా ఆంధ్ర, తెలంగాణల్లో వెతకడం ప్రారంభించామని ఎఎస్పీ వెల్లడించారు. దమ్మపేట మండలం మందలపల్లి వద్ద శుక్రవారం రాత్రి అరెస్టు చేశామన్నారు. రాజమండ్రి, అక్కడి నుంచి విశాఖపట్టణం, తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు కారు (టీఎస్28ఎల్ 0001)లో వస్తుండగా దమ్మపేట ఎస్సై పట్టుకున్నట్లు చెప్పారు. రాఘవతో పాటు ముక్తిని గిరీష్, రాఘవ కారు డ్రైవర్ కొమ్ము మురళీకృష్ణలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ నిమిత్తం విచారణ అధికారి ఆర్కే ప్రసాద్ ఎదుట హాజరుపరిచామన్నారు. పలు అంశాలపై రాఘవను విచారించామని తెలిపారు.
- రామకృష్ణను రాఘవ బెదించాడు
రామకృష్ణను బెదిరించినట్లు వనమా రాఘవ అంగీకరించారని ఏఎస్పీ తెలిపారు. లభ్యమైన ఆధారాలను సీజ్ చేసి కోర్టుకు సమర్పించామన్నారు. నిందితులను కాసేపట్లో కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామన్నారు. రాఘవపై మొత్తం 12 కేసులున్నాయని, వాటన్నింటిపై విచారిస్తామని తెలిపారు. కేసు దర్యాప్తు దశలో ఉన్న నేపథ్యంలో వివరాలన్నీ వెల్లడించలేమన్నారు. వనమా రాఘవపై ఫిర్యాదుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులుండగా వారిలో ఏ1 మండిగ నాగరామకృష్ణ (40) చనిపోయారని, ఏ2 వనమా రాఘవేంద్రరావు (58)తో పాటు ఏ5 ముక్తిని గిరీష్ (30), ఏ8 కొమ్ము మురళీకృష్ణ (27)లను అరెస్టు చేశామన్నారు. ఏ3 రామకృష్ణ తల్లి మండిగ సూర్యవతి, ఏ4 అక్క కొమ్మిశెట్టి లోవ మాధవి, ఏ6 చావా శ్రీనివాస్, ఏ7 రమాకాంత్ పరారీలో ఉన్నారని వివరించారు.