Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుగ్గ వీటి సరళ
నవతెలంగాణ-నేలకొండపల్లి
పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం బలవన్మరణానికి కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు మానవ మృగం రాఘవేంద్రరావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గ వీటి సరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నేలకొండపల్లి మండల కేంద్రంలో ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఐద్వా మండల అధ్యక్షురాలు బలుసు ప్రమీల అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ 77 ఏళ్ల స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య భారతావనిలో కూడా ఇంకా మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు వంటి అనాగరిక ఘటనలకు పాల్పడే నాటి భూస్వామ్య పెత్తందారి దొరల పాలన కొనసాగుతుండటం దారుణమన్నారు .అధికారం ఉందనే అండతో, అహంకారంతో తాను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని పేదల బలహీనతలను ఆసరా చేసుకుని రాఘవలాంటి ఎంతోమంది మానవ మృగాలు అమాయక కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న అసమర్థ విధానాల ఫలితంగా మహిళలపై రోజురోజుకూ దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నా యన్నారు. రామకృష్ణ కుటుంబం బలవన్మరణానికి కారణమైన రాఘవును కఠినంగా శిక్షించడం ద్వారా భవిష్యత్తులో మరో ఘటన జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలలో 100 మంది పాల్గొనగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సొలేషన్ బహుమతులు అందజేశారు. ఈ బహుమతులను మన్నె చిన్నపుల్లయ్య, మన్నె ఎలమంచయ్యా, మన్నె జశ్వంత్, వారి కుటుంబ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు నూతక్కి జ్వాల, పాలడుగు జయలలిత, కొంగర ప్రభావతి, ఐద్వా నాయకులు కూచిపూడి శ్రీదేవి, మున్నంగి లక్ష్మి, ఎడవల్లి సైదమ్మ, రైతు సంఘం నాయకులు గొడవర్తి నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు ఏటుకూరి రామారావు, కేవీ రామిరెడ్డి, మందడపు మురళీకృష్ణ, పగిడికత్తుల నాగేశ్వరరావు, పాలడుగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.