Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ కుటుంబ ఆత్మహత్యోదంతంలో మరో కోణం వెలుగులోకి వస్తోంది. రాజమండ్రిలో ఉంటున్న ఆయనకు జనవరి 2వ తేదీ ఉదయం ఓ ఫోన్‌కాల్ రావడంతో భోజనం చేసి పాల్వంచ బయల్దేరి వస్తామని చెప్పినట్లు సమాచారం. ఆ ప్రకారమే ఆయన కుటుంబంతో సహా బయల్దేరి పాల్వంచ వచ్చారు. మరుసటి రోజు 3వ తేదీ తెల్లవారుజామున సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆ ఫోన్ చేసిందెవరు? ఏమి చెప్పి రామకృష్ణను రప్పించారు? అనే అంశంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై 'నవతెలంగాణ' దినపత్రిలో మంగళవారం ప్రచరితమైన కథనం చర్చకు దారితీసింది. ఈ ఆత్మహత్యోదంతంలో ఓ ఫైనాన్స్ వ్యాపారి ప్రమేయం ఉన్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. 2వ తేదీ రామకృష్ణకు ఫోన్ చేసింది ఆ ఫైనాన్స్ వ్యాపారే అయ్యి ఉంటారని పలువురు భావిస్తున్నారు.
ఫైనాన్స్ వ్యాపారిపై అనుమానం
బల్లేరుగూడెంకు చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారితో గత కొంతకాలంగా రామకృష్ణ స్నేహసంబంధాలు విస్తృతంగా కొనసాగిస్తున్నారని స్థానికంగా చర్చించు కుంటున్నారు. స్వతహాగా మాటల మాంత్రికుడైన ఆ ఫైనాన్స్ వ్యాపారి రామ కృష్ణను వివిధ అంశాల్లో ప్రేరేపిస్తున్నట్లు అనుకుంటున్నారు. రామకృష్ణ సైతం అతని ట్రాప్‌లో పడి ఉంటారని భావిస్తున్నారు.
గతంలో వనమా రాఘ వేంద్ర రావుతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండే ఆ ఫైనాన్స్ వ్యాపారికి గత మూడేళ్ల క్రితం స్నేహసంబంధాలు చెడినట్లు చెబుతున్నారు. 'శత్రువు శత్రువు మితృవు' అనే కాన్సెప్ట్‌లో ఆ ఫైనాన్స్ వ్యాపారి రామకృష్ణకు మరింత దగ్గరైనట్లు చర్చించుకుంటున్నారు.
ఎంతకైనా తెగించే మనస్తత్వం ఆ ఫైనాన్స్ వ్యాపారిదట!
ఏ విషయంలోనైనా తనతో విభేదించినా... తన దగ్గర రుణం తీసుకున్న వారు తిరిగి డబ్బులు ఇవ్వడంలో తాత్సారం చేసినా... ఆ ఫైనాన్స్ వ్యాపారి ఎంతకైనా తెగిస్తారట. పాల్వంచ పట్టణంలో సగం మంది ఉద్యోగుల ఏటీఎం కార్డులు సైతం ఈ వ్యాపారి దగ్గరే ఉంటాయట. గతంలో ఈ వ్యాపారి తన మిత్తీలు వసూలు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు రాఘవను ఆశ్రయించేవారట. మూడేళ్ల క్రితం ఇలాంటి ఓ పంచాయితీ విషయంలోనే రాఘవ ఈ ఫైనాన్స్ వ్యాపారితో విభేదించారట. అంతే రాఘవపై నాటి నుంచి కక్ష పెంచుకున్న ఈ ఫైనాన్స్ వ్యాపారి అవకాశం వచ్చినప్పుడల్లా పైచేయి సాధించాలని రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారట. గతంలో ఓ ఎంప్లాయి పేరు మీద కారు తీసుకున్న ఈ వ్యాపారి నెలవారీ వాయిదాలు సరిగా చెల్లించలేదు. దాంతో ఆ ఉద్యోగి వేతనంలో నుంచి అమౌంట్ కట్ అవుతుండేవి. ఈక్రమంలో సదరు ఉద్యోగి ఈ ఫైనాన్స్ వ్యాపారిని గట్టిగా నిలదీసేసరికి బెదిరింపులకు దిగాడట. చేసేదిలేక ఆ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఈ వ్యాపారి వేధింపుల కారణంగా సొంత బావమరిది సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడని అంటున్నారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన వెంకటేశ్వర్లు ఉదంతంలోనూ ఈ ఫైనాన్స్ వ్యాపారి ప్రమేయం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఎదుటి వ్యక్తిని తన మాటలతో మాయ చేసే ఈ ఫైనాన్స్ వ్యాపారితో రామకృష్ణకు ఉన్న స్నేహమే పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
రామకృష్ణనూ ప్రేరేపించింది ఈయనేనా?
తన స్వార్థం కోసం, రాఘవతో చెలిమి చెడిన నేపథ్యంలో ఈ ఫైనాన్స్ వ్యాపారే రామకృష్ణను ప్రేరేపించివుంటారు? అనే అనుమానాన్ని పాల్వంచలో అత్యధికులు వెలిబుచ్చుతున్నారు. పాల్వంచ నవభారత్ సమీపంలో మీ సేవ కేంద్రం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న మండిగ నాగరామకృష్ణ గత ఏడెనిమిది నెలలుగా రాజమండ్రిలో అత్తారింటికి సమీపంలో ఉంటున్న విషయం విదితమే. అక్కడ ఉంటూ ఆస్తి తగాదాల పరిష్కారం, మీసేవ కేంద్రం తాలూకు పనుల నిమిత్తం అప్పుడప్పుడు పాల్వంచ వచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 30వ తేదీన ఓ ఫోన్‌కాల్ వచ్చాక... 'మన ఆస్తి తగాదాలు సెటిల్ అయ్యాయి. ఇక నుంచి మన హ్యాపీగా ఉండొచ్చు. మన పిల్లలను మంచిగా చదివించుకోవచ్చు. మన ఆర్థిక స్థితిగతులు మెరుగవుతున్నాయి' అని తన భార్య శ్రీలక్ష్మితో అన్నారని రామకృష్ణ బావమరిది జనార్దన్ 'నవతెలంగాణ'కు తెలిపారు. కానీ ఉన్నట్టుండి 2వ తేదీ ఉదయం మరో ఫోన్‌కాల్ వచ్చింది. వెంటనే పాల్వంచ బయల్దేరి వెళ్లారు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామునే ఆత్మహత్యోదంతం చోటుచేసుకుందని కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఆ ఫోన్‌కాల్ చేసింది ఎవరు? ఏమి చెప్పారు? అనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు. జనార్దన్ తల్లి రమాదేవికి స్వయాన అన్నకొడుకైన రామకృష్ణ తన భార్య, పిల్లలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడట. అటువంటిదీ ఇంతటి అఘాయిత్యానికి ఎలా ఒడిగట్టాడో అని రామకృష్ణ అత్త రమాదేవి కన్నీరుమున్నీరయ్యారు.