Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నష్టాల్లో కూరుకుపోయిన మిర్చి రంగాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వాలు విశేషంగా కృషి చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో పినపాక మండలంలోని జానంపేట రైతు వేదిక వద్ద నిర్వహించిన ఒక రోజు రైతు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు స్పైసెస్ బోర్డ్ నుండీ త్వరలోనే టార్పాలిన్ శిల్పాలిన్ పట్టాలను సబ్సిడీపై మంజూరు చేస్తామన్నారు. హరిజన గిరిజన రైతులకు 75 శాతం సబ్సిడీపై పరదాల పంపిణీ ఉంటుందని తెలిపారు. వెనుకబడిన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలలో స్పైసెస్ బోర్డు మరియు కషి విజ్ఞాన కేంద్రం సేవలను మరింత వేగవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను సాంబశివ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్పైసెస్ బోర్డు వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాధి లింగప్ప మాట్లాడుతూ సుగంధ పంటలను అభివృద్ధి చేసి సుగంధ పంటలను సాగు చేస్తున్న రైతుల అభ్యున్నతి కోసమే స్పైసెస్ బోర్డు పలు రకాల పథకాలను అమలు చేస్తోందని అన్నారు. కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనారాయణమ్మ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో తామర పురుగు సమస్య మిర్చి రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పది వేల పిపీయం వేప నూనెను విధిగా చెట్టు మొత్తం తడిసేలా పిచికారి చేసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ బయో మందులను వినియోగించవద్దని చెప్పారు. కొత్తగూడెం ఏరువాక కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బి శివ మాట్లాడుతూ మిర్చి లో తామర పురుగు నివారణకు పిప్రొనిల్ 80 శాతం 100 మిల్లీ లీటర్లు చొప్పున ఎకరాల విస్తీర్ణానికి పిచికారి చేసుకోవాలని తెలిపారు. జెనీలియా మందు 200 మిల్లీ లీటర్లు ఎకరాల విస్తీర్ణానికి పిచికారి చేసుకోవాలన్నారు.ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల సాంకేతిక అధికారి నాగేశ్వరరావు తమ శాఖ ద్వారా రైతులకు అందిస్తున్న పలు రాయితీ పథకాలను వివరించారు. అనంతరం జానంపేట, భూపతి రావు పేట గ్రామాల్లో ఉన్న మిర్చి పంట పొలాల క్షేత్రాలను పరిశీలించి స్థానిక రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సహకార సంఘం చైర్మన్ ముదునూరి రవిశేఖర్ వర్మ, జానంపేట సర్పంచ్ బాడిస మహేష్, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, అభ్యుదయ రైతు వెల్లంకి నరసింహారావు, సుమారు 70 మంది మిర్చి రైతులు పాల్గొన్నారు.