Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
తన తండ్రి వనమా పదవిని, అధికార పార్టీ హోదాను అడ్డుపెట్టుకొని తనయుడు వనమా రాఘవ అరాచకాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వనమా రాఘవేంద్రరావుపై రౌడీ షీట్ నమోదు చేయాలని అఖిలపక్ష నేతల బృందం జిల్లా ఎస్పీ సునీల్ దత్‌ను కోరారు. బుధవారం కొత్తగూడెం మాజీ శాసన సభ్యులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగసీతా రాములు, లక్కినేని సురేందర్, ధళసింగ్ నాయక్, సీపీఐ(ఎం) నాయకులు అన్నవరపు సత్యనారాయణ, లిక్కి బాలరాజు, భూక్య రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు బొల్లోజు మోహనాచారి, నాయకులు వీరభద్రం తదితరుల ప్రతినిధి బృందం జిల్లా పోలీసు ఉన్నతాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించి సమస్య తీవ్రతను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా వనమా రాఘవ అరాచకాలు శృతిమించి పోతున్నాయని, తన తండ్రి వనమా వెంకటేశ్వరరావు పదవులను అడ్డుపెట్టుకొని భూ దందాలు, సెటిల్మెంట్లు, మహిళలపై వేదింపులు వంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇతని చర్యలతో అనేక మంది అమాయకులు అన్యాయానికి గురై ఎవరికి చెప్పుకోవాలో తోచని దిక్కతోచని స్థితిలో మృతి చెందుతున్నారని తెలిపారు. పాల్వంచ ఆత్మహత్యల సంఘటపై పోలీసు శాఖ స్పందించిన తీరును అభినందిస్తున్నామని, కేవలం అరెస్టు, రిమాండ్‌తో సరిపెట్టకుండా రాఘవపై ఉన్న కేసులపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
మహిళలపై లైంగిక దాడులు, వేదింపులకు పాల్పడుతున్న రాఘవపై దిశ కేసు నమోదు చేయాలని, సమాజంలో సంచరించే అర్హత లేని రాఘవపై కఠిణ తరమైన చట్టాలు నమోదు చేసి బెయిల్ పొందేందుకు చేస్తు న్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, సత్వర శిక్షలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు.