Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే, జిల్లా అధికారులు దృష్టి సారించాలి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల వ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ అకాల వర్షానికి ఆళ్ళపల్లి ప్రధాన పురవీధులు వర్షపు నీరు నిలిచిపోయి, చిత్తడిగా మారాయి. ఓ ప్రధాన వీధిలో సీసీ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ ఎత్తుగా పోసి ఉండటంతో వర్షపు నీరు నిలిచిపోయి బురదమయమైంది.
దాంతో ఈ వీధిలో వెళ్లే వాహనాల, పశువుల రాకపోకలకు పాదచారులు అటుగా వెళ్తున్న సమయంలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే గడిచిన వర్షాకాలం, ప్రస్తుత శీతాకాలంలో డెంగ్యూ, రక్త పరీక్షల్లో తేలని ఒంటి నొప్పులతో కూడిన విష జ్వరాలతో స్థానిక ప్రజలు ఆరోగ్య పరంగా, ఆర్థికంగా నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో అకాలంగా కురిసిన భారీ వర్షానికి ఇంకా ఏం కొత్త రోగాలు, వ్యాధులు వస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఇప్పటికీ వీడని డెంగీ జ్వరాలు, డెంగీ మరణాలకు, విష జ్వరాలకు తోడు ఈ బురద మయమైన పురవీధులు అగ్నికి ఆజ్యం పోసినట్టు మారాయని పలువురు వాపోతున్నారు. ఒక్క రోజు వర్షానికే పురవీధుల పరిస్థితి ఇంత దీనంగా ఉంటే, వర్షాకాలంలో ఈ మండల కేంద్రములోని పురవీధుల దుస్థితి ఏమిటో? చెప్పకనే చెబుతోంది. ఇకనైనా నియోజకవర్గం ఎమ్మెల్యే, జిల్లా అధికారులు ప్రధాన పురవీధుల్లో మురుగు నీరు నిలిచిపోయి దోమల, ఈగల వల్ల ప్రజలకు విషజ్వరాలు, రోగాలు చుట్టుముట్టక ముందే ఓ ప్రధాన వీధిలో మరమ్మతులు, భగత్ సింగ్ సెంటర్ నుంచి ఉన్న మరో ప్రధాన గ్రావెల్ రోడ్లకు సీసీ రోడ్డు వేసేందుకు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.