Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో జలవనరులు, నీటిపారుదల ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని లకారం, ఖానాపురం ఊరచెరువుతో పాటు వెలుగుమట్ల, ధంసలాపురం చెరువుల పరిధిలో అక్రమణలను గుర్తించి సత్వరమే హద్దులను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రాంతాలలోని జలవనరులలో జరిగిన ఆక్రమణలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లకారం, ఖానాపురం ఊర చెరువు విస్థీర్ణం, ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఖమ్మం నగరపాలక సంస్థలో గల చెరువుల ఆక్రమణలను వెంటనే తొలగించి వాటిని పూర్వస్థితికి తెచ్చి అభివృద్ధి పర్చాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని లేఅవుట్లను తనిఖీ చేసి ఆక్రమణలను తొలగించాలని, ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్స్, నిర్ధారణ చేసి సరిహద్దులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో నిర్మాణాలకు అనుమతులను జారీచేసే ముందు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితులలో జలవనరులు, జల ప్రవాహాల ప్రదేశాలు, నీటిపారుదల స్థలాలలో అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా పటిష్ట చర్యలు ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ జి.శంకర్ నాయక్, పర్యవేక్షక ఇంజనీరు రవికుమార్, ల్యాండ్ సర్వే ఏడి వి.రాము, ఆర్డిఓ రవీంద్రనాథ్, రఘునాథపాలెం తహశీల్దారు నర్సింహారావు, అర్భన్ తహశీల్దారు శైలజ, నీటి పారుదల శాఖ డి.ఇలు, ఏ.ఇలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.