Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ- బోనకల్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ(ఎం) ప్రజా పోరాటాలు నిర్వహిస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుదర్శన్రావు అన్నారు. మోటమర్రి గ్రామంలో బుధవారం పార్టీ ఫండ్ కార్యక్రమాన్ని పోతినేని సుదర్శన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. పాలకులు పేద ప్రజలకు సేవలు అందించాల్సి ఉంది పోయి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పేరుతో వ్యవసాయ రంగాన్ని, రైతులను ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఎకరానికి 5వేల రూపాయలు ఇచ్చినంత మాత్రాన రైతులు ఎలా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయించడంలో రైతులు పోరాటం ప్రపంచానికే ఆదర్శం అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రుణ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతున్నా నేటి వరకు దానిని అమలు చేయడం లేదని విమర్శించారు.బీజేపీతో ఒకవైపు గల్లీలో రంకెలు వేస్తూ ఢిల్లీ వెళ్లి దోస్తీ చేస్తాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు దారుణంగా నష్టపోయి ఉంటే వారిని ఆదుకునే చర్యలు నేటికీ చేపట్టకపోవడం ముఖ్యమంత్రికి రైతుల పై ఉన్న ప్రేమ స్పష్టం అవుతుందని విమర్శించారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ చిట్టిమోదు నాగేశ్వరరావు, మోటమర్రి సొసైటీ అధ్యక్షుడు బోజడ్ల పుల్లారావు, సిపిఎం శాఖ కార్యదర్శి పిక్కల సీతారాములు, సిపిఎం మాజీ శాఖ కార్యదర్శి కేతినేని నాగేశ్వరరావు, మేడ గోపాలరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.