Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు చేపడుతున్న ఇండ్ల కూల్చివేతను నిలుపుదల చేయాలని, పట్టాల జారీ ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించి, సాంకేతిక లోపాలను సరిచేయాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల జిల్లా జెఏసీ నేతలు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ను కోరారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటకు మంత్రి వచ్చిన సందర్భంగా నూతన కలెక్టరేట్లో మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. నాయకులు మంత్రికి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... కొత్తగూడెం పట్టణ ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని గృహ యజమానులకు క్రమబద్దీకరణ పట్టాలు జారీ చేసేందుకు గతంలో జీవో నెంబరు 373ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 76ను జారీ చేసిందన్నారు. ఈ జీవో ఆధారంగా తమ ఇండ్లు, ఇండ్ల స్థలాలపై యమజాన్య హక్కు లభిస్తుందని ఆశించిన యజమానులకు నిరాశే మిగిలిందన్నారు. జీవోలు జారీ అయి ఏండ్లు గడుస్తున్నా నేటికి పూర్తి స్థాయిలో పట్టాలు అందలేదన్నారు. జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో తల దాచుకునేందుకు చేపడుతున్న ఇండ్లను అధికారులు కూల్చివేస్తూ నిరాశ్రయులను చేస్తున్నారన్నారు. ప్రజలకు జరుగుతున్న ఈ నష్టంపై సానుకూలంగా స్పందించి ఇండ్ల కూల్చివేతను ఆపే విధంగా చర్యలు చేపట్టాలని, పట్టాల జారీని వేగవంతం చేసే విదంగా ఆదేశాలు జారీ చేయాలని, 2014 కట్ ఆఫ్ డేట్‌ను ఎత్తివేసి పట్టాలకోసం దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో పట్టాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరుగుతున్న సాంకేతిక లోపాలను సరిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కిలారు నాగేశ్వర్ రావు, మహిపతి రామలింగం, టీడీపీ జిల్లా నాయకులు అనంతరాములు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు వి.పూర్ణచందర్రావు, కంచర్ల జమలయ్య, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, నాయకులు మాచర్ల శ్రీనివాస్, భూక్య శ్రీనివాస్, బోయిన విజరు కుమార్, దొడ్డ రవి తదితరులు ఉన్నారు.