Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దేవరాపల్లిలో రైతుల రాస్తారోకో
అ మద్దతు ప్రకటించిన సిపియం, టీఏజీఎస్
అ జీసీసీడీఎమ్తో మాట్లాడిన సిపియం నాయకులు
అ డీఎం హామీతో రాస్తారోకో విరమణ
నవతెలంగాణ-చర్ల
మండల పరిధిలోని దేవరాపల్లిలో పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలని, క్వింటాకు 10కేజిలు తరుగు తీసే విధానం రద్దు చేయాలని కారం ఆంజనేయులు, సాయమ్మ తదితర రైతుల ఆధ్వర్యంలో రెండు గంటలకుపైగా చర్ల - భద్రాచలం ప్రధాన రహదారిపైన రాస్తారోకో నిర్వహించారు. అదే మార్గంలో ప్రయాణిస్తున్న సిపియం నాయకులు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రాస్తారోకో చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను సంబంధిత అధికారులకి ఫోన్ ద్వారా తెలియజేశారు.దేవరాపల్లి గ్రామంలో జీసీసీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.1001 రకం దాన్యం లావుఒడ్లు కొనుగోలు చేయకుండా కొనుగోలు కేంద్రం నిర్వహకులు రైతులను ఇబ్బందులకు గురిచేయటం వలన వారి రాస్తారోకోకు పూనుకున్నారు. ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మకై 10కేజిల తరుగుపేరుతో దోపిడీ చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.బ్రహ్మాచారి జీసీసీ డివిజనల్ మేనేజర్ కుంజా వాణి దృష్టికి ఫోన్ ద్వారా వివరించారు. రైతులు పడుతున్న ఇబ్బందులు ఆమెకు నాయకులు వివరించారు.
రైతుల దగ్గర నుండి మొత్తం ధాన్యం కొనుగోలుచేస్తామని జీసీసీడీఎం రైతుల సమస్యలను సిపియం టీఏజీఎస్ నేతలు, జీసీసీడీఎంకి వివరించగా ఆమె స్పందించారు.రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. 1001 రకం, సహా అన్నీ రకాల వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతుల దగ్గరనుండి దాన్యం సేకరణ పూర్తి అయ్యే వరకు కొనగోలు కేంద్రాన్ని దేవరపల్లిలో నిర్వహిస్తామని తెలిపారు. 10కేజిల తరుగు విషయం జిల్లా కలెక్టర్‌కి వివరిస్తామని, తరుగు తీయకుండా ధాన్యం తీసుకోవటానికి మిల్లర్లు ముందుకు రావడంలేదని తెలిపారు. ఈ సమస్యను పరిష్కారం చేయటానికి కలెక్టర్ ద్వారా మిల్లర్లతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కారం చేయకపోతే మరల ధర్నా చేస్తామని నాయకులు అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.బ్రహ్మాచారి, కారం పుల్లయ్య, టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు మాట్లాడారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా వుందని అన్నారు. 10 కేజిల తరుగు రైతును దోపిడీ చేయటమే అవుతుందని తెలిపారు. తరుగు తీసే విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం ధాన్యం కొనేవరకూ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మాజీ ఎంపీపీ మర్మం చంద్రయ్య, దేవరపల్లి రైతులు కృష్ణమూర్తి, విద్యాసాగర్, జనార్ధన్, ఇర్ప.రమేష్, పొడియం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.