Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 2 నుంచి జరిగే సమ్మెలో
కార్మికులు భాగస్వామ్యం కావాలి
అ సింగరేణి కార్మిక సంఘాల
జేఏసీ నాయకులు
నవతెలంగాణ-కొత్తగూడెం
సుప్రీంకోర్టు తీర్పు, కాంట్రాక్టు లేబర్ చట్టం ప్రకారం సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఫిబ్రవరి 12 నుంచి సింగరేణి వ్యాపితంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రకటించారు. ఏఐటియుసి జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసి నాయకులు మాట్లాడారు. కోల్ ఇండియాలో హైపర్ కమిటీ సూచించిన వేతనాలు అమలు జరుగుతుందగా సింగరేణి యాజమాన్యం వేతనాల చెల్లింపు కాంట్రాక్టర్ల చేతికి అప్పగించిందన్నారు. సింగరేణి వ్యాపితంగా 30 వేలకుపైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తుండగా వీరికి పని భద్రత, వేతన భద్రత కరువైందన్నారు. ఇటీవల పలు ప్రమాదాలు జరిగి, కోవిడ్ భారిన పడి కార్మికులు మృతి చెందితే పట్టించుకున్న నాధేడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తూ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తూ లాభాలను ఆర్జిస్తున్న కాంట్రాక్టు కార్మికుల పట్ల యాజమాన్యం వివక్షత ప్రదర్శిస్తోందని అన్నారు. ఇప్పటికే 18 డిమాండ్లతో యాజమాన్యానికి సమ్మెనోటీసు జారీ చేశామని, సమ్మెనోటీసుపై కేంద్ర లేబర్ శాఖ అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో యాజమాన్యం మొండిగా వ్యవహరించడం వల్లే నిరవధిక సమ్మెకు పూనుకుంటున్నామని తెలిపారు. ఇటీవలే మూడు రోజులపాటు జరిగిన నిరసన కార్యక్రమాలను జయప్రదం చేసిన కార్మికులకు దన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో 12 నుంచి జరిగే నిరవధిక సమ్మెకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ విలేకర్ల సమావేశంలో ఏఐటియుసి, సిఐటియు, ఇఫ్య్లూ, హెచ్ఎంఎస్ సంఘాల జిల్లా నాయకులు గుత్తుల సత్యనారాయణ, పిట్టల రాంచందర్, ఎర్రగాని కృష్ణయ్య, చంద్రశేఖర్, డి.ప్రసాద్, పి.సతీష్, కాలం నాగభూషణం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల పెంపు, చట్టబద్ధ సౌకర్యాల అమలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిరసన బ్యాడ్జీలు ధరించి సింగరేణి యాజమాన్యానికి నిరసన వ్యక్తం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మణుగూరు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన కార్యక్రమం విజయవంతమైందని జేఏసీ నాయకులు వెలగపల్లి జాన్, ఎండీ గౌస్, ఎం.నాగేశ్వరరావు, తోట రమేష్‌లు తెలిపారు. శుక్రవారం స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఈ మేరకు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి ఎండీ గౌస్ అధ్యక్షతన జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జాన్, ఎండీ గౌస్, ఎం.నాగేశ్వరరావు, తోట రమేష్, యాకయ్య, పుష్ప రాజ్ పాల్గొన్నారు.