Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలోని మున్సిపాల్టీలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, డీఈ, ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పారిశుధ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి అన్ని మున్సిపాల్టీలో ప్రతి ఇంటి నుండి నూరు శాతం చెత్తసేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెత్త సేకరణ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యమైన అంశమని చెప్పారు. చెత్త సేకరణ ప్రక్రియ ఏవిధంగా జరుగుతున్నదని మున్సిపల్ కమిషనర్లును అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెంలో 67 శాతం, ఇల్లందులో 95 శాతం, పాల్వంచ 76లో శాతం, మణుగూరులో 40లో శాతం ఇంటింటి నుండి చెత్త సేకరణ జరుగుతున్నట్లు చెప్పారు. ప్రతి డిఆర్సిసిలో చెత్త వేరుచేయు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. వార్డుల వారిగా చెత్తను వర్మి తయారు చేయుటకు టెట్రా వర్మి బెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగూడెం పట్టణంలోని పంచతంత్ర, రాజీవ్ పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని నిర్మాణంలో జాప్యం చేసే కాంట్రాక్టర్లుకు నోటీసులు జారీ చేయాలని, బ్లాక్ లిస్టులో పెట్టాలని హెచ్చరించారు. మణుగూరు మున్సిపార్టీ పరిధిలోని కమలాపురం, చిన్నరావిగూడెంలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణ సమయంలోనే పటిష్ట పర్యవేక్షణ జరగాలని, టాస్క్ ఫోర్సు, టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టిన యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటు తొలగింపు ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు మున్సిపాల్టీలలో ఇండోర్ షటిల్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, కోర్టులు ఏర్పాటు ప్రతిపాదనలు అందచేయాలని చెప్పారు.