Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ఆదివాసీ మహిళలపై అసభ్యకరంగా దుర్భాషలాడి దాడి చేసిన అటవీశాఖ అధికారి మహేష్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ) జిల్లా నాయకులు మందుల రాజేంద్ర పసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములకలపల్లి మండలంలో ఆదివాసి మహిళలపై ఫారెస్ట్ అధికారి మహేష్ చేసిన దాడికి నిరసనగా న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నినాదాలు చేసుకుంటూ,ముదిగొండలో ఆదివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాకివలసా అనే గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు తమ రోజువారి పని వల్లే అడవికిపోయి పొయ్యిలో కట్టెల కోసం వెళితే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారి మహేష్ మహిళల పట్ల కిరాతకంగా దుర్భాషలాడి వారిని వివస్త్రకు గురిచేశాడని ఆవేదన వ్యక్తంచేశారు. అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి నిర్భయచట్టం కింద శిక్షపడేలా చేయాలన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ న్యూడెమోక్రసి) ముదిగొండ గ్రామ కార్యదర్శి మాదారపు ఉమాశంకర్, ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా ఉపాధ్యక్షులు పాముల మోహన్ రావు, సిహెచ్ మధు, ధర్మయ్య,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి : మండల పరిధిలోని సాకివాగు గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలపై ఫారెస్టు గార్డు మహేష్ దాడి ఘటనపై విచారణ అధికారులు ఎక్కడా .. అంటూ ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రశ్నించారు. ఆదివారం ఆయన సాకివాగు గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. గిరిజన మంత్రి స్పందించి ఐటీడీఏ పీవోను విచారణ అధికారిగా నియమించారని తెలిపారు . అయినప్పటికీ నేటికీ ఒక్క అధికారి కూడా ఘటన జరిగిన గ్రామాన్ని సందర్శించకపోవడం శోచనీయమన్నారు.
అడవిలో జీవించే హక్కు గిరిజనులకు లేదా..?:
సీపీఐ రాష్ట్ర నేత నరాటి డిమాండ్
మండల పరిధిలోని సాకివాగు గ్రామానికి చెందిన ముగ్గురు ఆదివాసీ గిరిజన మహిళలపై ఫారెస్టు అధికారి , సిబ్బంది ప్రవర్తించిన తీరు అమానుషమని , ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు . ములకలపల్లిలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు సంబంధిత శాఖ మంత్రికి పంపినట్లు ఆయన తెలిపారు . ఈ సమావేశంలో ఎంపీటీసీ జబ్బార్, మండల సహాయ కార్యదర్శి నరాటి రమేష్ నాయకులు కీసరి గంగరాజు, వీరునాయక్, ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ మహిళలను వివస్త్రను చేసిన ఫారెస్ట్ వారిపై చర్య తీసుకోవాలి : టిఏజియస్ జిల్లా కార్యదర్శి
సరియం కోటేశ్వరరావు
భద్రాచలం:జిల్లాలోని ములకలపల్లి మండలంలోని ఆదివాసీ గ్రామం సాకివలస గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డ్ అమానుషంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజియస్) జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు పిలుపు నిచ్చారు. ఆదివారం భద్రాచలం జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలను వివస్త్ర ను చేయడం అమానుషానికి పరాకాష్టగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన ఫారెస్ట్ వారి దౌర్జన్యాలకు పరాకాష్ట అని ఆయన అన్నారు. పోయిలోకి కట్టెలు తెచ్చుకోవడం కూడా నేరమా? అడివిని మేస్తున్న బడా కంపెనీలను,బడా బాబులను కాపాడుతూ, నోరులేని ఆదివాసుల మీద ఇంత దాస్టికమా? అని ప్రశ్నించారు.ఫారెస్ట్ బీట్ గార్డ్ మహేష్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఏజియస్ జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్, కారం పుల్లయ్య, సున్నం గంగ పాల్గొన్నారు.
గిరిజన మహిళలపై జరుగుతున్న
దాడులను అరికట్టాలి : ఐద్వా
భద్రాచలం : భద్రాచలం ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 20వ వార్డు రాజుపేటలో గిరిజన మహిళలపై జరిగిన దాడులను అరికట్టాలని ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కార్యదర్శి డి సీతాలక్ష్మి, జిల్లా నాయకురాలు నాదెళ్ల లీలావతి లు మాట్లాడుతూ ములకలపల్లి మండలంలో ముగ్గురు మహిళలు అడవికి వెళ్ళారని, అక్కడ ఉన్న గార్డ్ ముగ్గురు మహిళలను దారుణంగా కొట్టడం జరిగింద ని వారు పేర్కొన్నారు. పూర్వ కాలం నుంచి ఆదివాసులు అడవిలో పండినవి తెచ్చి అమ్ముకొని బ్రతుకుతారని అన్నారు. అలాంటి అడవి తల్లి బిడ్డలను దారుణంగా కొట్టిన గార్డు ను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో కే.రమణ, కే.చుకమ్మ, ఎస్.కే చోట మ్మ, కే.రుక్మిణి, పి .మంగమ్మ , బి.లక్ష్మి, ఏం.అన్నపూర్ణ ఎస్.నాగమణి, తదితరులు పాల్గొన్నారు.