Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రూ.10.55 లక్షల విలువైన
బంగారు ఆభరణాలు అపహరణ
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో ఐటీసీ పీఎసీపీడీలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారపాకలోని కండక్టర్స్ కాలనీకి చెందిన ఐటీసీ పీఎస్ పీడీ కాంట్రాక్టర్ మల్లిపెద్ది శరత్ కుమార్ పిల్లలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఖమ్మంలోని తన అత్తగారింటికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న రాంబాబు అనే వ్యక్తి శరత్ కుమార్‌కు ఫోన్ చేసి మీ ఇంటికి తూర్పుభాగంలో ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి, మీరు వచ్చారా అని అడిగారు. ఈ క్రమంలో మేము రాలేదని చెప్పి వెంటనే తన వద్ద పనిచేస్తున్న ముదిగొండ రవికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని చెప్పాడన్నారు. రవి, రాంబాబులు కలిసి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తీసి ఉందని, చీరలు చిందరవందరగా పడి ఉన్నాయని, కబోర్డులు తెరిచి ఉన్నాయని, బంగారం కవర్ హాలులో పడేసి ఉందని యజమాని శరత్ కుమార్‌కు వారు చెప్పారు. అయితే సోమవారం ఇంటికి చేరుకుని చూడగా బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గమనించి పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బూర్గంపాడు అదనపు ఎస్సై ఖాజా నసీరుద్దీన్, క్లూసీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్‌టీం సిబ్బంది వేలిముద్రలు, తదితర వాటిని సేకరించారు. ఈ దొంగతనంలో బాధితునికి సంబంధించిన మూడు బంగారు నక్లెస్‌లు, నల్లపూసల గొలుసు, మూడు బంగారు గొలుసులు, ఐదు బంగారు ఉంగరాలు, పెద్ద సెట్టు బంగారు చెవిదిద్దులు, బుట్టలు, చెవికన్నులు, రెండు వెండి కుంకుమ గిన్నెలు, గంధం గిన్నె, మూడు జతల పట్టీలు, 2 వడ్డాణాలు (రోల్డ్ గోల్డ్వె) మొత్తం 41.500 తులాల బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని బాధితుడు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.10.55 లక్షలు ఉంటుందని తెలిపారు. బాధితుడు శరత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై సముద్రాల జితేందర్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.