Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
జిల్లాలో నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున దళితబంధు లబ్దిదారుల ఎంపిక జాబితాను ఫిబ్రవరి 5 వ తేదీలోగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ, సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో దళితబంధు లబ్దిదారుల ఎంపిక పట్ల అధికారులకు జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో సంబంధిత శాసనసభ్యుల ఎంపిక మేరకు నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళితబంధు లబ్ధిదారుల జాబితాను, జిల్లా మంత్రివర్యుల ఆమోదం అనంతరం మార్చి-7 నాటికి యూనిట్ల గ్రౌండింగ్ ఆయ్యోల సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దళితబంధు లబ్దిదారుల ఎంపిక ప్రభుత్వ నియమనిబంధనలు, మార్గదర్శకాల మేరకు జరగాలని కలెక్టర్ సూచించారు. చింతకాని మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పైయిలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున మండలంలోని ప్రతి లబ్దిదారునికి దళితబంధు వర్తించబడుతుందని, మధిర నియోజకవర్గానికి సంబంధించి మిగిలిన నాలుగు మండలాల్లో వంద మంది కుటుంబాలను ఎంపిక చేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, సాంఘిక సంక్షేమ శాఖాధికారి కె.సత్యనారాయణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి. అప్పారావు, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, లీడ్‌బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌రావు, తదితరులు టెలీ కాస్ఫరెన్స్లో పాల్గొన్నారు.