Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే ద్వారా ప్రజల ఆరోగ్య రక్షణ, వైద్య సేవలు వినియోగించుకోవడం పట్ల అవగాహన, భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్ లో జరిగిన కోవిడ్-19 కోర్ కమిటీ సమావేశంలో రెండవ డోసు వ్యాక్సినేషన్, కోవిడ్ టెస్టులు, ఇంటింటి జ్వర సర్వే తదితర అంశాలపై వైదాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి జ్వర సర్వేకు వెళ్ళే వైద్యబంధాలు, కోవిడ్ లక్షణాలు కలిగిన వారికి హౌమ్ ఐసోలేషన్ కిట్ అందించడంతో పాటు సమయానికి మందులు వాడడం ద్వారా ఇంటి వద్దనే పూర్తిగా కోలుకుంటారని, ఆసుపత్రులకు వెళ్ళే అవసరం ఉండదనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించి వారికి భరోసానివ్వాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల సంఖ్యను మరింత పెంచాలని, లక్షణాలు కలిగిన వారికి తప్పనిసరిగా టెస్టులు చేయాలన్నారు. ఇంటింటి జ్వర సర్వేకు వెళ్ళే బంధాలకు ఎన్-95, సర్జికల్ మాస్క్‌లను తప్పనిసరిగా అందించాలని, కార్పోరేషన్ పరిధిలో నగరపాలక సంస్థ కమీషనర్ ద్వారా, గ్రామీణ ప్రాంతాలలో ఎం.పి.డి.ఓల ద్వారా మాస్క్‌లను సర్వే బంధాలకు సరఫరా చేయాలని జిల్లా వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుచున్నప్పటికి ఆసుపత్రులలో అడ్మిషన్ల సంఖ్య ఎక్కువగా లేదని అయినప్పటికి ముందస్తుగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు ఏరియా ఆసుపత్రులలో అవసరమైన బెడ్స్, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. దీనితో పాటు ఖమ్మం నగరంలోని శారదా ఇంజనీరింగ్ కళాశాల, వై.టి.సి భవనాలలో క్వారెంటైన్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టి సంసిద్ధంగా ఉంచాలన్నారు. అదేవిధంగా మండల కేంద్రాలలో విద్యాసంస్థలను మినహాయించి ఇతర ప్రదేశాలలో క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటుకు ఎం.పి.డి.ఓలు అనువైన భవనాలను ఎంపిక చేసి అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. రెండవ డోసు వ్యాక్సినేషన్ మిగిలిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి స్థాయిలో చేరుకొని, వ్యాక్సినేషన్ డేటా ప్రతిరోజు ఆన్లైన్ ఆప్డేట్ చేయాలని, రెండవ డోసు తీసుకొని నిర్ణీత కాలపరిమితి పూర్తి చేసుకున్న వారికి బూస్టర్ డోసును అందించాలని తదనుగుణంగా జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా?మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా?బి. వెంకటేశ్వర్లు, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా?రాజేష్, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరీ, డా? సైదులు, తదితరులు కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.