Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దళిత సంక్షేమ సంఘం
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండలంలో ప్రతీ గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని వెంటనే వీటిని నిరోధించాలని దళిత సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... వ్యాపారులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ తద్వారా మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నారని, ఈ కారణంగా పేద మద్యం ప్రియులు ఆర్ధికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అశ్వారావుపేట నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడం, నియోజకవర్గంలోని మండలాల్లో ఎక్కువగా దళిత-గిరిజనుల నివాసాలు ఉండటంతో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రకారం షాపులు కేటాయించినప్పటికీ బినామీల హవానే నడుస్తుందని అన్నారు. పేరుకే రిజర్వేషన్లు కానీ వెనుక బడాబాబులు భినామిలుగా ఉండి నడిపిస్తున్నారు అన్నారు. ఈ వ్యవహారమంతా అధికారుల కను సన్నలోనే జరుగు తుందని ఆరోపించారు. ముఖ్యంగా అశ్వారావుపేట దమ్మపేట మండలాల్లో షాపులకు అనుసంధానంగా గ్రామాల్లో 7 నుంచి 10 వరకు బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి అన్నారు. లైసెన్స్ షాపులు నుండి నేరుగా బెల్ట్ షాపులకు రూ.20లు క్వార్టర్‌పై షాపులు నుండి మద్యాన్ని వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారని తెలిపారు. బెల్ట్ షాపుల నిర్వాహకులు క్వార్టర్ పై రూ.80లు నుంచి రూ.100లు లాభం వేసుకొని అమ్మకాలు చేస్తున్నారని, దీంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి రావలసిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళి పోతుందని అన్నారు. అంతే కాకుండా బెల్ట్ షాపుల వల్ల మద్యం లూజు విక్రయాలు జరుగుతుండటంతో మద్యం నాణ్యత తగ్గి, ఇది సేవించిన మద్యం ప్రియులు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన చెందారు. అంతే కాకుండా దళిత గిరిజన కుటుంబాలు చిన్నాభిన్నం అవటమే కాకుండా ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడి గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ఈ తతంగాన్ని సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ మామూళ్ల మత్తులో జోగుతూ ఉన్నారని ఆరోపించారు. అందువల్ల ఏజెన్సీ గ్రామాల్లో బెల్ట్ షాపుల పై పర్యవేక్షణ లేకపోవడం పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అలాగే బినామీలను తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ప్రకారం ఎవరు లైసెన్స్ దారులైతే వారే నిర్వహించాలని, బెల్ట్ షాపులు ఏజెన్సీ గ్రామాల్లో తొలగించే వరకు దళిత సంక్షేమ సంఘం దశల వారీ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గద్ధల అప్పారావు, కార్యదర్శి ఆవుల చిన్ని, ఉపాధ్యక్షులు మామిడి కృష్ణ, విద్యార్ధి సంఘ రాష్ట్ర కార్యదర్శి కొలికపోగు ధర్మరాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గొల్లమందల పెంటయ్య, ఎస్సీ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు గిద్ధ కొండయ్య, జిల్లా సీనియర్ నాయకులు కోలికపోగు ప్రభు దేవా, తదితరులు పాల్గొన్నారు.