Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
గత సంవత్సరాల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూదాన భూములను అనుభవదారులైన రైతులకే పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ ఎర్రు వెంకట్రావు, ఎంపీటీసీ సభ్యులు దోమందుల సామేలు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కూరపాటి ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులతో పాటు కలసి డిప్యూటీ తాసిల్దార్ కెఎంఎం అన్సారీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమలాపురం గ్రామ రెవిన్యూ పరిధిలో గల సత్య నారాయణపురం గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 58లో ప్రభుత్వం ఇచ్చిన భూదాన భూమిలో గత కొన్ని శతాబ్దాలుగా రైతులు భూమిని సాగు చేసు కుంటూ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. అట్టి భూమిలో 10 మంది రైతులకు చెందిన 35 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన వారికి పాస్ పుస్తకాలు అక్రమ మార్గంలో ఇప్పించారని అన్నారు. సదరు 58 సర్వే నంబర్లోని భూదాన భూములు ఇప్పటికీ భూదాన్ బోర్డు ఇచ్చిన సత్యనారాయణపురం గ్రామ రైతుల కుటుంబ సభ్యులు అనుభవంలో ఉన్నారని అన్నారు. దీనిపై ఈ నెల 21వ తేదీన ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ జమలాపురం వచ్చిన సందర్భంలో రైతులు తమ భూమి అన్యాక్రాంతమైన దానిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌కి వినతిపత్రం అందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 1983లో భూదాన్ బోర్డు ద్వారా ఇచ్చిన భూములను రీ సర్వే చేసి వంశపారంపర్యంగా అనుభవంలో ఉన్న రైతులకు పాస్ పుస్తకాలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో రైతులు పివి కృష్ణారావు, శివ నాగేశ్వరరావు, ఆర్.శ్రీనివాసరావు, అయ్యప్ప స్వామి, ఆర్.కృష్ణ, కే.గోపాల్‌రావు, పి.నాగరాజు, హనుమంతరావు, పి శ్రీను తదితర రై తులు పాల్గొన్నారు.