Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వందేళ్ల చరిత్ర కలిగిన నిజాం నాటి విశ్రాంతి భవనానికి కనీస మరమ్మతులు చేయటానికి ప్రస్తుత ప్రభుత్వానికి మనసొప్పటం లేదా, శిథిల దృశ్యంగా ఉంచదలుచుకుందా ? అని రాజకీయ పార్టీలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. నిజాం పాలనలో వైరా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టే సమయంలో వైరా నడిబొడ్డున ఉన్న ఎత్తైన ప్రదేశంలో డబుల్ పోర్షన్ విశ్రాంతి భవనం నిర్మించారు. ఇప్పటికీ దాని వయస్సు 100 ఏళ్లు. వైరా ప్రాజెక్ట్ నిర్మాణానికి 1923 లో శంఖుస్థాపన చేసి 7 ఏళ్ల కాలంలో పూర్తి చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో అధికారులు పనుల పర్యవేక్షణకు వచ్చి ఇక్కడ మకాం వేసేవారు. అప్పటి వైరాలో వేళ్లపై లెక్కించే ఇళ్లే ఉండేవి. అప్పుడు దాని పేరు క్యాంపుగా పిలిచేవారు. అందుకే వైరా మునిసిపాలిటీగా మారే 4 ఏళ్ల క్రితం వరకు సోమవరం ( వైరా) మేజర్ గ్రామ పంచాయతీ గా అధికారికంగా పిలవబడే ది. కాల క్రమంలో వైరా విస్తృతంగా విస్తరించి అభివృద్ధి చెందినది. ఈ క్రమంలో నిజాం కాలం నాటి విశ్రాంతి భవనం అధికార, ప్రతి పక్ష పార్టీలకే గాక, జిల్లా కలెక్టర్, ఎస్పి స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తెలంగాణ రాష్ట్రాల ఇతర జిల్లాల అధికార,అనధికార ప్రముఖులకు ఆతిద్యమిచ్చిన విశ్రాంతి భవనం నేడు ప్రభుత్వ నిర్లక్షానికి గురైంది. తెలంగాణ మొదటి ప్రభుత్వం అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యేకి క్యాంపు కార్యాలయం నిర్మించింది. వైరాలో పాత విశ్రాంతి ( నీటి పారుదల శాఖ) భవనం ప్రక్కనే విశాలమైన స్థలంలో సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే అధికార నివాసం అయింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నందున అధికార, ఆ పార్టీ కార్యకలాపాలన్నీ అక్కడే చక్కబెట్టుకుంటున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలకు చిన్న చిన్న కార్యాలయాలున్నా, పెద్ద సమావేశాలకు, అఖిల పక్ష సమావేశాలకు అనివార్యంగా ఫంక్షన్ హాళ్లకు వెళ్లాల్సిందే. గతంలో విశ్రాంతి భవన ప్రాంగణం లోనే జరుపుకుని అధికారులు నిర్ణయించిన ఫీజ్ చెల్లించే వారు. రాజకీయ పార్టీల సంగతి అలా ఉంచితే, స్వచ్ఛంద సంస్థలకు, జర్నలిస్టులకు, అధికారులకు వైరాలో నిలువ నీడ లేకుండా పోయింది. నిజాం కాలం నాటి విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరుకుందని, 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 15 లక్షలు వెచ్చించి దాని ప్రక్కనే రెండు పోర్షన్లతో మరొక విశ్రాంతి భవనం నిర్మించారు. కాని నిజాం కాలం నాటి విశ్రాంతి భవనం కంటే ముందే కొత్తది శిధిలం కావటం విశేషం. పాత విశ్రాంత భవనంలో ఒక దానిలో అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యే లు ఉంటే, మరో సూట్ లో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే లు ఉండి వారి పనులు చక్కబెట్టుకున్నారు. అందరికీ అందుబాటులో ఉన్న విశ్రాంతి భవనాన్ని శిధిల దృశ్యంగా మార్చి , దానిఆస్తుల లోనే ( నీటి పారుదల శాఖ స్థలం) ఈ ప్రభుత్వం హారితా రెస్టారెంట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఇండోర్ స్టేడియం, ప్రాజెక్ట్ కమిటీ ఆద్వర్యంలో గోదాం నిర్మించింది. ప్రస్తుతం సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టింది. కానీ శిధిలమౌతున్న పాత విశ్రాంతి భవనాన్ని కనీస మరమ్మతులు చేయటానికి ప్రక్కనే ఉన్న నియోజక వర్గ ప్రజా ప్రతినిదికి గాని, వారానికి ఒకసారి వైరాను సందర్శించి వైరా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న జిల్లా కలెక్టర్కు గాని దానిపై దృష్టి సారించకపోవడం విచారకం అని ప్రజలు భావిస్తున్నారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన మధిర శాసన సభ్యులు, సి ఎల్ పి నేత మల్లు బట్టి విక్రమార్క, ఇతర ప్రతి పక్ష పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవటానికి కూడా ఈ విశ్రాంతి భవనాలు ఉపయోగ పడకుండా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నవి. వైరా గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి ఎదిగిన ది. కొన్ని పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకున్నవి. వాటితో పాటు పదిమందికి అవసరమైన విశ్రాంతి భవనాల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నవి.