Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కందకాలు తీసేందుకు వచ్చిన ఫారెస్ట్
జేసీబీలను అడ్డుకున్న పోడు రైతులు
అ జేసీబీలతో వెనుదిరిగి వెళ్లిన
ఫారెస్ట్ అధికారులు
అ పోడు భూములు లాక్కోవాలనే ఆలోచన
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రేగాదే : ఎంపీపీ
నవతెలంగాణ-గుండాల
పోడు భూముల్లో కందకాలు తీసేందుకు వచ్చిన ఫారెస్ట్ జేసీబీలను పోడు రైతులు అడ్డుకున్నారు. మా భూములు లాక్కుంటే మేమెట్లా బతకాలని ప్రశ్నిస్తూ పోడు రైతులు జేసీబీలను అడ్డుకుని ధర్నాకు దిగారు. దీంతో కొంతసేపు పోడు రైతులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని ముత్తాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దతోగు గ్రామంలోని పోడు భూముల్లో కందకాలు తీసేందుకు ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో శుక్రవారం వచ్చారు. అయితే ముత్తాపురం గ్రామస్తులు ఫారెస్ట్ జేసీబీలను పెద్దతోగు వెళ్లనీయకుండా ముత్తాపురంలోనే అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా విషయం తెలుసుకున్న సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అక్కడికి చేరుకుని అటు ఫారెస్ట్, ఇటు పోడు రైతులతో మాట్లాడారు. ఆదివాసీ, ఆదివాసియేతర ప్రజలు ఏండ్ల తరబడి పోడు భూములనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని అలాంటిది పోడు భూములను లాక్కుని పోడు రైతులను రోడ్డున పడేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఎంపీపీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పోడు పట్టాలి స్తామని ఒకపక్క పోడు రైతులను మభ్యపెడుతూనే మరోపక్క పోడు భూములను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే రేగా ముందు ఫారెస్ట్ అధికారులు తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పోడు సాగుదారులు గోడు వెళ్లబోసుకుంటే రైతులకు నేనున్నానంటూ ఫారెస్ట్ జిల్లా అదికారులతో ఫోన్లో మాట్లాడి పోడు రైతులను ఇబ్బంది పెట్టోద్దని చెప్పిన రేగా కాంతారావు ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కందకాలు తీసేందుకు వస్తుంటే ఆపకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నిం చారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి పోడు రైతులకు న్యాయం చేయాలని కోరారు.
బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పేందుకే పోడు భూములను లాక్కుంటున్నారు
: ఎన్డీ రాష్ట్ర నాయకులు మధు
గత ముప్పై, నలభై ఏండ్లుగా పోడు భూములనే నమ్ముకుని జీవిస్తున్న ప్రజలను వెళ్లగొట్టి బహుళ జాతి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పోడుభూములను స్వాధీనం చేసుకుంటుందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు అన్నారు. శుక్రవారం మండలంలోని ముత్తాపురం, తూరుబాక, నడిమిగూడెం, పెద్దతోగు గ్రామాల్లో ఆదివాసీలు ఇతర పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తీయడం కోసం జేసీబీలతో బయలుదేరగా పోడు రైతులతో కలిసి అడ్డుకుని మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో న్యూడెమోక్రసీ గుండాల సబ్ డివిజన్ కార్యద ర్శి నరేష్, పర్శిక రవి, భానోత్ లాలు, కొమరం హను మంతరావు, సత్యనారాయణ, పూనెం నరసయ్య, రాంబాబు, రమేష్ తదిరులు పాల్గొన్నారు.