Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దళితబంధును రాజకీయం చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించడం సరికాదని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తొలుత నిర్ణయించిన విధంగా కలెక్టర్లకే ఈ పథకం బాధ్యతలు ఉంచాలని కోరారు. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పథకం ఉద్దేశాలను దెబ్బతీసేలా విధివిధానాల్లో మార్పులు చేయడం సరికాదని తెలిపారు. నియోజకవర్గానికి వంద మంది చొప్పున కాకుండా మండలానికి వందమంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులకు ఈ పథకం బాధ్యతలు ఇవ్వడం ద్వారా పక్కదారిపట్టే అవకాశం ఉందని, లబ్ధిదారుల ఎంపికలో వివక్ష చోటుచేసుకునే ప్రమాదం ఉంటుందని తెలిపారు. దీనివల్ల దళితుల మధ్య స్పర్థలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టే ఇలాంటి ఆలోచన సరికాదన్నారు. మార్చి 31లోపు పథకాన్ని 118 నియోజకవర్గాల్లో అమలు చేయాల్సి ఉందని, ఇంతలోనే నిబంధనలు మార్చడం సరికాదని పేర్కొన్నారు. దళిత సాధికారతే ప్రధాన ఉద్దేశంగా అమలు చేయాలని భావించి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని వివాదాలకు దారితీసేలా విధివిధానాల్లో మార్పులు చేయడం సరికాదని తెలిపారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఇచ్చే ఈ భారీ పథకానికి రాజకీయరంగు పులమడం ద్వారా అవినీతి, అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించినట్లుగా 118 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసినా రూ.1,180 కోట్లు అవసరం అవుతాయని, ఇప్పటి వరకు ఈ నిధులపై స్పష్టత లేదని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల దళిత కుటుంబాలున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించారని గుర్తు చేశారు. ఇలా నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఇచ్చుకుంటూ పోతే రూ.1.70 లక్షల కోట్లు అవసరం అవుతాయని, ఇలా ఇస్తే పథకం పూర్తయ్యేనాటికి ఆరేళ్లు పడుతుందని వివరించారు. కాబట్టి పథకం అమలులో సీఎం చిత్తశుద్ధిని కనబరచాలని, వివాదాలకు తావులేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని నున్నా నాగేశ్వరరావు కోరారు.