Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో ప్రభుత్వ రంగ వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి టి.హరీష్ రావు వైద్యాధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్తో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య సేవలపై మంత్రి హరీశ్ సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి 18 ప్రభుత్వ వైద్య కళాశాలలను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఒక్కో కళాశాలకు రూ.5 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వ్యవస్థలో అవసరాలు, లోపాలు ఉంటాయని, అవసరాలను తీరుస్తూ లోపాలను కూడా సవరిస్తామని, ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగం పోటీ తత్వంతో సేవలందించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఔషధాల కొరత సమస్య రావద్దని, సర్జికల్, మెడికల్ కోసం బడ్జెట్లో మరో వంద కోట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చామని, వైద్యాధికారుల నియామకాలకు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించామన్నారు. అన్ని వసతులను సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్యాధికారులను ఆదేశించారు.
వందశాతం రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి..
ఖమ్మం జిల్లా కోవిడ్-19 వ్యాక్సినేషన్లో మొదటి డోసు 103 శాతం, రెండో డోసు 94 శాతం లక్ష్యాలను సాధించిందని, అతి త్వరలోనే రెండో డోసు 100 శాతం పూర్తి చేసి దక్షిణ భారత దేశంలో మూడో జిల్లాగా నిలవాలని, ఇప్పటికే బెంగుళూరు, కరీంనగర్ జిల్లాలు మొదటి, రెండో స్థానంలో నిలిచాయని మంత్రి తెలిపారు. ఇంటింటి జ్వర సర్వే ద్వారా హౌమ్ ఐసోలేషన్ కిట్స్ పొందిన వారికి తదుపరి రోజు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితులను వాకబు చేయాలన్నారు. ఇంటింటి జ్వర సర్వే రెండవ విడతను పూర్తి చేయడంతో పాటు 15-17 సంవత్సరాల వయస్సు కలిగిన వారి వ్యాక్సినేషన్ కూడా త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి...
కె.సి.ఆర్ కిట్స్, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తుండటం, ఉచిత రవాణా సౌకర్యంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 30 నుండి 50 శాతానికి పెరిగిందన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక టెక్నాలజీ, మానవ వనరులను పెంచినా ఇంకనూ 3 శాతం ఇనిస్టిట్యూషన్ డెలవరీస్ జరుగుతున్నాయని తెలిపారు. ఇరు జిల్లాల్లో ఇటువంటి గ్రామాలను గుర్తించి వందశాతం ఆసుపత్రి ప్రసవాలయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు.
జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య 28 శాతం మాత్రమే ఉందని, పుట్టిన గంటలో తల్లిపాలు ఇస్తే పిల్లలు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటారని తెలిపారు. సాధారణ ప్రసవాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు మొదటి గంటలో తల్లి పాలు అందించాలన్నారు. ఇరు జిల్లాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచి సి-సెక్షన్ ప్రసవాలను పూర్తిగా అరికట్టాలని మంత్రి ఆదేశించారు. శస్త్ర చికిత్సలకు ప్రభుత్వ ఆసుపత్రులలో చేరే ప్రతి పేషెంట్ ను ఆరోగ్య శ్రీ కింద నమోదు చేయాలని, ఆర్థో, గైనిక్, కంటి శస్త్ర చికత్సలకు ఆయుష్మాన్ భారత్ కింద ప్రవేశపెట్టిన సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం క్వాలిటీ ఎస్సురెన్స్ సర్టిఫికెట్ తేవాలని, తద్వారా సంవత్సరానికి 3 లక్షల గ్రాంట్ వస్తుందని మంత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి అభివద్ధికి 66 లక్షలు మంజూరు చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అవసరాలకు పల్లె దవాఖానల సబ్ సెంటర్లకు నిధులు విడుదల చేశామని తెలిపారు. జిల్లాలో కల్తీ విక్రయాలను అరికట్టేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు మరింత అంకిత భావంతో పనిచేయాల న్నారు. కాలపరిమితి దాటిన ఔషధాల విక్రయాలు చేయకుండా డ్రగ్ ఇన్స్పెక్టర్లు నిరంతర తనిఖీ లు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రులను వంద పడకల ఆసుపత్రు లుగా మార్చుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. జ్వర సర్వేలో వ్యాక్సినేషన్ డేటాను కూడా సేకరిస్తున్నామని, తద్వారా రెండవ డోసు తీసుకోవాల్సిన వారి డేటా సేకరణ సులువు అయిందని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
ఈ సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్, టి.ఎస్.ఎం.ఐ.డి.సి చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయూష్ కమిషనర్ అలుగు వర్షిణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇంచార్జీ కమిషనర్ రమేష్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయపు ఓ.ఎస్.డి గంగాధర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు డామాలతీ, డా,దయానందస్వామి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు డా బి.వెంకటేశ్వర్లు, సరళ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.