Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ లింగాల కమల రాజుకి సీపీఐ(ఎం) చొప్పకట్లపాలెం నాయకులు ఆదివారం రాత్రి వినతిపత్రం అందజేశారు. మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజు వెళ్లారు. దీంతో చొప్పకట్లపాలెం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కమల్ రాజుకి అందజేశారు. గ్రామంలోని బీసీ కాలనీలో సైడ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల నీరు మొత్తం రోడ్డుపై చేరి నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోందని, బీసీ కాలనీలో అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీగోడ లేకపోవడం వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రహరీగోడ లేకపోవడం వల్ల పశువులు, పందులు, కుక్కలు అంగన్వాడి కేంద్రంలోకి వెళ్తున్నాయని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. పాఠశాలలో ప్రస్తుత విద్యార్థులు సంఖ్య భారీగా పెరిగిందని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించేందుకు కృషి చేయాలని వారు కోరారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంలో కనీస వసతులైన విద్యుత్, బోరు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధులు మంజూరు చేయించాలని కోరారు. దీంతో కమల్ రాజు స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కిలారు సురేష్, శాఖ కార్యదర్శులు చలమల అజరు కుమార్, బోయినపల్లి పున్నయ్య, బండి శ్రీనివాసరావు, నాయకులు తోటకూర మాధవరావు, ఉన్నం వెంకటేశ్వర్లు, బి.గోపాల్ రావు తదితరులు ఉన్నారు.