Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర బడ్జెట్లో భద్రాద్రి అభివృద్ధికి
నిధులు కేటాయించాలి
అ భద్రాచలంకు ఆనుకుని ఉన్న
5 పంచాయతీలను
భద్రాచలంలో కలపాలి
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం అభివృద్ధి పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, బడ్జెట్లో భద్రాద్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) భద్రాచలం పట్టణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పోలవరం ముంపు పేరుతో భద్రాచలం నియోజకవర్గాన్ని ముక్కలు చెక్కలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి భద్రాచలం ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆయన గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు భద్రాచలం అభివృద్ధికి నోచుకోక కుండా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందని ఆయన అన్నారు. రేపటినుండి జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో విభజన సందర్భంగా ఆంధ్రాలో కలిపిన భద్రాచలంకి ఆనుకొని ఉన్న ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపాలని, దక్షిణ భారత అయోధ్యగా పిలువబడే భద్రాచలంను రామాయణం సర్క్యూట్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే లైను నిర్మాణంకు నిధులు కేటాయించాలని ఆయన అన్నారు.
విభజనచట్టం హామీలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు గిరిజన యూనివర్సిటీని భద్రాచలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో భద్రాచలం పట్టణానికి పొంచి ఉన్న ముంపు ప్రమాదం పట్ల ఒక స్పష్టత ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భద్రాద్రి అభివృద్ధి అంశాలపై నోరు విప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.