Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భద్రాచలం ఆదివాసి సమితి
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సహకార సంస్థ(జీసీసీ) డివిజనల్ మేనేజర్ కుంజా వాణిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని భద్రాచలం ఆదివాసి సమితి (బిఏయస్), ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పాయం రవివర్మ పేర్కొన్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీసీసీలో గత అనేక సంవత్సరాల నుండి నిజాయితీ గల అధికారిగా పేరు సంపాదించి డివిజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆదివాసి మహిళ కుంజా వాణిపై లంబాడా నాయకులు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తూ వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక ఆదివాసీ మహిళా జీసీసీలో ఉన్నత స్థానంలో పని చేయడాన్ని జీర్ణించుకోలేని లంబాడి నాయకులు, సంస్థలోనే పని చేస్తున్న కొంతమంది అధికారులతో కలిసి ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. సంస్థను సమర్థవంతంగా నడుపుతున్న అధికారిని వేధింపులకు గురిచేయడం తగదని ఆయన అన్నారు. జీసిసి సంస్థని అనేక విధాలుగా ప్రక్షాళన చేసి తన ఆధ్వర్యంలో ఆదివాసి నిరుద్యోగ మహిళలని బృందాలుగా ఏర్పాటు చేసి వారితోనే పప్పు ధాన్యాలు, సబ్బులు బిస్కెట్లు, షాంపూ ప్యాకెట్లు అనేక ఉత్పత్తులు చేయించి వారు ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. వారు చేసిన ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేసి గిరిజన సంక్షేమ వసతిగృహాలకు సరఫరా చేసేటట్లుగా కృషి చేసిన ఘనత ఇప్పుడు పని చేస్తున్న జనరల్ మేనేజర్ వాణికే దక్కిందని ఆయన అన్నారు. అదేవిధంగా జీసీసీ ద్వారా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి కూడా అధికారులను సమన్వయం చేసుకొని కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. సంస్థలో ఎలాంటి అవినీతికి చోటు లేకుండా వసతి గృహాలకు నాణ్యమైన సరుకులు అందించి ఆదివాసి విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా కృషి చేస్తున్న అధికారి గురించి తెలియకుండా తప్పుడు ఫిర్యాదులు, ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆదివాసి సమితి సలహాదారులు కుంజా ధర్మా, పూనెం వీరభద్రం, ఆదివాసి మహిళా చైతన్య శక్తి ఉపాధ్యక్షురాలు కొండ్రు సుధారాణి, ఆదివాసి అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ చీమల నరసింహారావు, సీనియర్ న్యాయ వాది పర్షిక సోమ రాజు, మహిళా నాయకురాలు సోయం మంగ వేణి, గొర్రె భద్రమ్మ, సున్నం భూలక్ష్మి, జెజ్జరి సమ్మక్క, పాయం వెంకట లక్ష్మీ, కారం కృష్ణవేణి ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.