Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
దళిత బంధు పథకం ద్వారా దళితులు వ్యాపార వేత్తలుగా ఎదగాలని, పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలని, అదే దళితబంధు పథకం ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో దళితబంధు పథకం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకానికి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెల 5వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మార్చి, మాసాంతం వరకు ఎంపిక చేసిన లబ్దిదారులకు యూనిట్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయనున్నట్టు ఆయన వివరించారు. పథకం పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించినట్లు చెప్పారు. దళితబంధు పథకం అమలులో మన జిల్లా ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. పథకంపై ప్రతి జిల్లా అధికారి స్పష్టమైన అవగాహన కలిగి ఉ ండాలని, అన్ని శాఖల అధికారులను ఈ పథకంలో భాద్యులను చేయనున్నట్లు ఆయన వివరించారు. లబ్దిదారుల ఎంపిక చేసిన గ్రామ, మున్సిపాల్టీలలో దళితబంధు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వాసాలమర్రి గ్రామంలో పథకం అమలు బాగా జరుగుతున్నదని, అంతకంటే మంచిగా మన జిల్లాలో అమలు జరిగే విధంగా కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు. ఎస్సీలు నివసించు గ్రామాల జాబితా మంగళవారం వరకు ఎంపిక చేయాలని చెప్పారు. ఎస్సీ కుటుంబాల వారు వారి కాళ్ల మీద వారు నిలబడి ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామిక వేత్తలను తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఒకే రకమైన యూనిట్లు నెలకొల్పడం వల్ల ఇబ్బందులు వస్తాయని, అది దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల యూనిట్లు నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డిమాండ్ బట్టి యూనిట్లు ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు. ఎంపిక చేసిన లబ్దిదారులకు రూ.9 లక్షల 90 వేలు చెల్లించి, మిగిలిన రూ.10 వేలకు ప్రభుత్వ వాటాగా రూ.10 వేలు కలిపి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు మరణించిన లబ్దిదారుల కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిధి ఒక ఇన్సూరెన్సు వలే ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాలోని 5 ఐదు నియోజకవర్గాలలో 500 మంది లబ్దిదారులను ఎంపిక పూర్తయిన తదుపరి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఆయన వివరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో దళితబంధు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శాసనసభ్యులు ఎంపిక చేసిన జాబితాను మంత్రి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి ముత్యం, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, సిఈఓ విద్యాలత, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.