Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
వేతనాలు పెరుగుదల, సౌకర్యాల పెంపు కోరుతూ ఫిబ్రవరీ 12వ తేదీన చేపట్టనున్న నిరవధిక సమ్మెకు సింగరేణి ఓబీ కార్మికులు సిధ్ధంగా ఉండాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహిం చిన సన్నాహక సమావేశంలో కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నదులు మాట్లాడుతూ ఈ రోజు సింగరేణిలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సింగరేణి యాజమాన్యం గత కొన్నేండ్లుగా కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచకుండా కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు అమలు చేయకుండా, సెలవులు, క్యాంటీన్ తదితర సౌకర్యాలు అమలు చేయకుండా చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కోల్ ఇండియా కాంట్రాక్టు కార్మికులకు రోజుకు రూ.950 చెల్లిస్తుంటే సింగరేణి కేవలం రూ.437 చెల్లించి చేతులు దులుపుకుంటోదన్నారు. హక్కుల సాధన కోసం అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు ఈ నెల 12 నుంచి సమ్మెలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు సీఐటీయూ జిల్లా నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకులు నిమ్మటూరి రామకృష్ణ పాల్గొన్నారు.