Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
నాగపూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కింద భూములు కోల్పోతున్న రైతులను పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఖమ్మం జిల్లాలోని ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులను మంగళవారం మధిర మండలం సిరిపురం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి రావాలంటూ తెలంగాణ ప్రాంతీయ కాలుష్య నివారణ కేంద్రం కొత్తగూడెం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జిల్లా అధికారులు గత నెల 31న పేపర్ లో ప్రకటన జారీ చేశారు. సోమవారం నాడు అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి తిరిగి రైతులను మీటింగ్ కి రమ్మని పిలిచారు. సమావేశానికి రైతులంతా పెద్ద యెత్తున వచ్చారు. కానీ ఈ సమావేశానికి రావాలని పిలిచిన అధికారులు మాత్రం హాజరు కాలేదని, నేషనల్ హైవే జిల్లా పిడి దుర్గాప్రసాద్ ను ఫోన్లో సంప్రదించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, రైతులను పిలిచి సమావేశంలో అధికారులు రాకపోవడంతో రైతులు ప్రధాన రహదారిపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ రైతులను పిలిచి అధికారులు రాకపోవడం ముమ్మాటికి రైతులను అవమానించడమేనని అన్నారు. ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేల పేరుతో 3 వేల ఎకరాలలో నిర్వాసితులు అవుతున్నారని, రైతులను రోడ్డుపాలు చేస్తుంటే ఊరుకోబోమని అన్నారు. భూ నిర్వాసితులు జేఏసీ జిల్లా నాయకులు ఎస్. నవీన్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంగల్ రావు, మంద నరసింహ రావు, మధు, రామ నరసయ్య, వేములపల్లి సుధీర్, ప్రతాపనేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.