Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల నిర్లక్ష్యం
- ప్రభుత్వ ఆదాయానికి గండి
- ఉన్నతాధికారులకు వినతి
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మండల తాసిల్దార్ జగదీశ్వర్ ప్రసాద్ సెలవుపై వెళ్లడంతో ఇసుక కావలసిన వారికి కూపన్లు జారీ చేయక పోవడం వలన ఇసుకకు కొరత ఏర్పడిందని మండల ప్రజలు విమ ర్శిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన కృత్రిమంగా ఇసుక కొరత ఏర్పడిందని, సుమారు గత నెల రోజుల కాలం నుండి మండల తాసిల్దార్ సెలవుపై వెళ్లడంతో డిప్యూటీ తాసిల్దార్ కెఎంఎం అన్సారీకి ఇంచార్జి బాధ్యతలు అప్పగించకపోవడం వలన కొరత సృష్టించబడిందని పలువురు విమర్శిస్తున్నారు. గృహ నిర్మాణదారులు పలు గ్రామ పంచాయతీలలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లు, సిసిడ్రైనేజీల నిర్మాణానికి ఇసుక కొరత ఉందని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. నిర్మాణ రంగంపై ఆధారపడిన కూలీలు రెవెన్యూ అధికారులపై మండిపడు తున్నారు. ఇసుకకు కావలసిన కూపన్లు జారీ చేయకపోవడం వలన అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుందని, అక్రమ రవాణాకు పరిస్థితులు దారితీస్తాయని విమర్శిస్తున్నారు. తాసిల్దార్ కార్యాలయంలో కేవలం భూముల రిజిస్ట్రేషన్ల పై మాత్రమే అధికారులు దృష్టి సారిస్తున్నారని పలువురు చర్చించు కుంటున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇసుక కొరతను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఆర్డివోకు ఫిర్యాదు
మండల పరిధిలో ప్రస్తుతం మీనవోలు, చొప్పకట్లపాలెం, తక్కెళ్ళపాడు గ్రామాలలో ఇసుక రేవులు అందుబాటులో ఉన్నాయి. ఈ రేవుల నుండి ఇసుక రవాణాకు మండల తాసిల్దార్ లేకపోవడంతో అధికారులు అధికారికంగా కూపన్లు జారీ చేయడంలో అలసత్వం వహిస్తున్నారని మండల పరిధిలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన బోబ్బిళ్ళపాటి బాబురావు ఆర్డిఓ రవీంద్రనాథ్‌కు వినతిపత్రం అందించడంతో సమస్యను పరిష్కరిస్తామన్నారని బాబురావు తెలిపారు.