Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భద్రాద్రికి తీరని ద్రోహం చేసిన నరేంద్ర మోడీ
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
ఏజే రమేష్
నవతెలంగాణ-భద్రాచలం
కేంద్రంలో మొదటిసారి అధికారం చేపట్టిన బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ తన మొదటి సంతకంతోనే భద్రాచలం నియోజక వర్గంలోని నాలుగు మండలాలను ఆంధ్రాలో కలిపి ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని, నిత్యం రామ జపం చేసే బిజెపికి భద్రాచలం పట్ల ఇంత వివక్షత ఎందుకని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ విమర్శించారు. భద్రాచలంలో గురువారం మర్లపాటి రేణుక అధ్యక్షతన జరిగిన సిపిఎం పట్టణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక సంతకంతో ముంపు మండలాలను ఆంధ్రలో కలిపిన కేంద్రం భద్రాచలంకు ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణకు తేలేదా అని ప్రశ్నించారు. బీజేపీకి అయోధ్య రాముని పై ఉన్న ప్రేమ భద్రాద్రి రామునిపై లేదని ఆయన విమర్శించారు. రామాయణం సర్క్యూట్ లో భద్రాచలంలో చేర్చాలని, ఈ పార్ల మెంటు సమావేశాల్లోనే ఐదు పంచాయితీలను భద్రాచలం తెలంగాణలో కలుపుతూ ఆర్డినెన్స్ తేవాలని ఆయన డిమాండ్ చేశారు. పాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే లైను మంజూరు చేయాలని ఆయన అన్నారు. గోదావరి పై రెండవ బ్రిడ్జి నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని, పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం పట్టణ ముంపు పై కేంద్రం ఒక స్పష్టత ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన రూ. 100 కోట్లు వెంటనే మంజూరు చేయాలని ఆయన అన్నారు. భద్రాచలం మున్సిపాలిటీ నా లేక పంచాయతీయే తేల్చాలని ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బి. నరసారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా, కార్యదర్శి వర్గ సభ్యులు బి. వెంకట రెడ్డి, బండారు శరత్ బాబు, వై. వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, నాదెళ్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు.