Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ- సత్తుపల్లి
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేకుంటే రాష్ట్రంలో మరో మహత్తర ఉద్యమాలను నిర్వహించి ఉద్యోగాలు సాధిద్దామని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జిల్లా సహాయ కార్యదర్శి సత్తెనపల్లి నరేశ్ అన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారు సురేశ్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నరేశ్, యంగ్ ఉమెన్ కో-కన్వీనర్ షేక్ రోషన్‌ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 ఏండ్లు దాటినా ఖాళీగా ఉన్న ఒక లక్షా 92వేల ఉద్యోగాలను ఇంత వరకు భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారా, లేక రాజీనామా చేస్తారా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. అనేక ఆశలతో ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు రాక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో 1400 మంది ఆత్మత్యాగాలు చేశారని, వారి త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు భరోసా లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు నిరుద్యోగులపై వ్యవహరిస్తున్న తీరు కారణంగా వారు మనస్థాపానికి గురవుతున్నారన్నారు. అందుకే వెంటనే ఖాళీగా ఒక లక్షా 92వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ మండల నాయకులు గోపి, మహేశ్, లక్ష్మణ్, రామకృష్ణ పాల్గొన్నారు.