Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క
నవతెలంగాణ- ఖమ్మం
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ను ఎంత తొందరగా వదిలించుకుంటే రాష్ట్రానికి అంత మంచిదని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఖమ్మంలోని సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ కొత్త రాజ్యాంగం రాయాలని అనడానికి సిగ్గు ఉండాలన్నారు. . పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య కాదా అని నిలదీశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన రాజ్యాంగ ఫలాలను దేశంలో ఉన్న నూటికి 90 శాతం మంది ప్రజలు పొందిన ప్రయోజనాలను చూసి ఓర్వలేని ఫ్యూడల్ శక్తులు తిరిగి రాచరిక వ్యవస్థను పునర్నిర్మాణం చేసే కుట్రలో భాగంగా కొత్త రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నాయని అన్నారు. ఈ ఫ్యూడల్ శక్తులకు ప్రతినిధిగా ఉన్న కెసిఆర్ వ్యాఖ్యలను భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఏకీభవిస్తారా? రాజ్యాంగం కల్పించిన పదవులకు దూరంగా ఉంటారా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు కావాలని అనుకునే ప్రతి పౌరుడు కుట్రదారుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న మేధావులారా, ప్రజాస్వామిక వాదులారా, యువతీ యువకుల్లారా... నాటి స్వాతంత్ర సమరయోధులు అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు భారత రాజ్యాంగ పరిరక్షణ భాగస్వాములవుదామని, కుట్రదారులను దూరంగా పెడదామని'' విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర డి బ్లాక్ చైర్మన్ బాలగంగాధర్ తిలక్, పుచ్చకాయల వీరభద్రం, మొక్క శేఖర్ గౌడ్, దొబ్బల సౌజన్య, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకుడు సంతోష్, సైదులు నాయక్. తదితరులు పాల్గొన్నారు.