Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిహారం ప్రభుత్వాల మోసపూరిత చర్యలు
నవతెలంగాణ - వైరా టౌన్
వైరా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు, రహదారులు, డ్రైనేజీ నిర్మాణంలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని, మున్సిపాలిటీ పాలక వర్గం తీర్మానాలకు విలువ ఇవ్వాలని, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కోసం భూ నిర్వాసితులకు నష్టపరిహారం బహిరంగ మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. శుక్రవారం వైరా సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ పరిధిలోని రహదారుల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం లాంటి అభివృద్ధి పనుల విషయంలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల ఆస్తులకు నష్టం చేయవద్దని అన్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించే ఖమ్మం నుంచి దేవరపల్లి, నాగపూర్ నుంచి అమరావతి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల నిర్మాణం కోసం చేస్తున్న భూసేకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత చర్యలు మానుకోవాలని, భూ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను గ్రామాలు, మండలాలుగా విభజన చేసి అరకొర పరిహారం చెల్లించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. శాశ్వతంగా భూమి కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా మణి, మల్లెంపాటి రామారావు, బోడపట్ల రవీందర్, బొంతు సమత తదితరులు పాల్గొన్నారు.