Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి పువ్వాడ అజరుకుమార్
నవతెలంగాణ- ఖమ్మం
నగర ప్రజలకు మరింత మెరుగైన పౌరసేవలందించేం దుకుగాను రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మితమవుతున్న నగరపాలకసంస్థ కార్యాలయాన్ని అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తునట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. నగరపాలకసంస్థ నూతన కార్యాలయ భవన ముగింపు పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ అదర్శ్ సురభితో కలిసి మంత్రి పరిశీలించి పలు సూచనలు అదేశాలు చేశారు. నూతన కార్యాలయంలో కౌన్సిలర్లు, మేయర్ ఛాంబర్, ఫర్నీచర్, సీటింగ్ ఏర్పాట్లపై మంత్రి పలు సూచనలు చేశారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసుకుంటున్న నగరపాలక సంస్థ కార్యాలయంలో జిహెచ్ఎంసీ తరువాత రాష్ట్రంలో ఏ కార్పోరేషన్లో లేనివిధంగా అధునిక వసతులను సమకూరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువీశాలంగా నిర్మించుకుంటున్న నగరపాలక సంస్థ కార్యాలయ భవనాన్ని అతి త్వరలోనే రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రిచే ప్రారంబించుకోనున్నామని, రాబోయే 50 సంవత్సరాల వరకు నగర ప్రజలకు అత్యాధునిక వసతులతో కూడిన పౌరసేవలు అందించే విధంగా కార్యాలయ భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సిటిజన్ చార్ట్, టౌన్లెనింగ్, మీ సేవా తదితర పౌరులకు అవసరమయ్యే అన్ని సదుపాయాలు కార్యాలయ ప్రాగణంలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం నగరంలో ఎక్సైజ్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసుకుంటున్న మరో మోడల్ సమీకత వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులను మంత్రి పరిశీలించారు. మార్కెట్ పరిసర ప్రాంతాలలో రెసిడెన్షియల్ ఏరియా, అపార్ట్మెంట్ ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎక్కువ సంఖ్యలో మార్కెట్ సేవలు వినియోగించుకుంటారని తదనుగుణంగా పార్కింగ్, ఇతర వసతులు ఉండేలా పనులు చేపట్టి మార్కెట్ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, స్థానిక కార్పోరేటరు పగడాల శ్రీ విద్య, నగరపాలక సంస్థ పర్యవేక్షక ఇంజనీరు అంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు క్రిష్ణలాల్, డి.ఇ.రంగారావు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, గుత్తేదారులు తదితరులు పాల్గోన్నారు.