Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ శ్రీ భద్రాచలం దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు శుక్రవారం శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరంలో అత్యంత సాదాసీదాగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కోవిడ్ నిబంధనల మేరకు ప్రారంభించారు. ధ్యాన మందిరంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామదాసు ధ్యాన మందిరం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించి రామదాసు పుట్టుక జీవిత చరిత్ర గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధ్యాన మందిరం ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న ఆడిటోరియం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన ఉత్సవ సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. అందులో భాగంగా మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించాల్సిన ఉత్సవాలను ఒక్క రోజుకే కుదించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కరోనాను పూర్తిగా నిర్మూలన చేయగలిగితే ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించు కోవచ్చు అన్నారు. ధ్యాన మందిరం ఆవరణంలో నిర్మిస్తున్న భక్త రామదాసు ఆడిటోరియం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా భక్త రామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టర్ విపి గౌతమ్ ను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల సంద ర్భంగా నిర్వహించిన కచేరీలు కళాకారులు ఆలపించిన వివిధ సాంస్కతిక కళారూపాలు పాటలు పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామస్తులు రామదాసు ఉత్సవాలను సాదాసీదాగా నిర్వహించడంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో అనేకచోట్ల జాతరలు, యాగాలు, ఉత్సవాల పేరుతో లక్షలాది మంది జనంతో నిర్వహిస్తూ భక్తరామదాసు జన్మస్థలంలో ఆయన ఉత్సవాలను సాదాసీదాగా నిర్వహించడంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామంలో అక్రమ వెంచర్ల పేరుతో కొంతమంది రియల్టర్లు పలు అక్రమాలకు పాల్పడుతు న్నారని ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా నేలకొండపల్లి గ్రామం నాలుగు వైపులా సరిహద్దులను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు ప్రజల సౌకర్యార్థం ట్రాన్స్కో మండల రెగ్యులర్ ఏఈ ఏర్పాటు చేయాలని, మండల కేంద్రం ప్రధాన సెంటర్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం నేలకొండపల్లి సమీపం లోని బౌద్ధ స్థూపాన్ని ఆయన సందర్శించారు. అక్కడ నిర్మిస్తున్న విశ్రాంతి భవనం పనులను ఆయన పరిశీలించి, బాలసముద్రం చెరువును సందర్శించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ శ్యాంప్రసాద్, జేఈ కృష్ణ మోహన్, ఎన్ఎస్పి ఈఈ శ్రీనివాసరావు, ఏఈ రత్నగీత, పర్యాటకశాఖ డిఈ రామకృష్ణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, తహసీల్దార్ ధారా ప్రసాద్, ఎంపిఓ శ్రీనివాస్, భద్రాచలం దేవస్థానం సూపరింటెండెంట్ సాయిబాబా, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్వికె నారాయణరావు, నేలకొండపల్లి, ముజ్జుగూడెం గ్రామ సర్పంచులు రాయపూడి నవీన్, ఉన్నం బ్రహ్మయ్య, భక్త రామదాసు విద్వత్ కళాపీఠం అధ్యక్షులు సాదు రాధాకష్ణమూర్తి, భక్త రామదాసు సర్వీస్ సొసైటీ నూతన అధ్యక్షులు ఎలమద్ది లెనిన్, నెల్లూరు వీరబాబు, వల్లంచెట్ల భాస్కరరావు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జెర్రిపోతుల సత్యనారాయణ కొత్త జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.