Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చివరి మజిలీలోనూ తప్పని కష్టాలు
నవతెలంగాణ-బోనకల్
మధిర నియోజకవర్గంలో ఉన్న దళిత స్మశానవాటికలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్న 142 గ్రామాల్లో సుమారు 120 గ్రామాల్లో దళితులకు స్మశాన వాటికలు ఉన్నాయి. కానీ దళిత స్మశానవాటికలో కనీస సౌకర్యాలు లేక అష్టకష్టాలు పడుతూ మృతదేహాలను సమాధి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాల్లో అయితే స్మశానవాటికలకు వెళ్లేందుకు సరైన ఆధారాలు కూడా కూడా లేవు. వర్షాకాలంలో మృతదేహాలను తీసుకొని స్మశాన వాటికలోకి వెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులున్నాయి. దళితుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు పాలకులు చెబుతున్నా ఆచరణలో మాత్రం అవి అమలు కావడం లేదు. కొన్ని గ్రామాల్లో సమాధి చేయడానికి మృతదేహంతో పాటు దళిత స్మశాన వాటిక వద్దకు వచ్చిన బంధుమిత్రులు సమాధి చేసే వరకు ముక్కు మూసుకొని ఉండాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గతంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహకారంతో పిఎస్ఆర్ ట్రస్టు ద్వారా దళిత స్మశానవాటికలో పెరిగిన ముళ్ళకంప తొలగించి స్మశానవాటిక వద్దకు వెళ్లేందుకు చిన్నపాటి రహదారిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల కోసం వైకుంఠ దామాలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం దళిత స్మశానవాటికల అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలని దళితులు కోరుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ లీడర్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత స్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిధులతో వైకుంఠ ధమాలను నిర్మించింది. అక్కడ మౌలిక వసతులు సైతం కల్పించింది. అదేవిధంగా దళితులకు కేటాయించిన స్మశాన వాటిక లలో సైతం మౌలిక వసతులు కల్పించాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికి కూడా దళితులకు స్మశాన వాటికలు లేకపోవటం గమనార్హం. గ్రామాల్లో దళితులకు స్మశానవాటికలో ఏర్పాటు చేయాలని గతంలో అనేక రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం దళితుల స్మశాన వాటికలు ఏర్పాటు చేసి వాటిల్లో మౌలిక వసతులు కల్పించాలని దళితులు కోరుతున్నారు.