Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భద్రాచలం పట్టణ
మనుగడ కోసం జరిగే పోరాటం
అ భద్రాచలం పట్టణ ప్రముఖులు పాకల
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంకు ఆనుకుని ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని, భారత ప్రధాని నరేంద్ర మోడీకి పదివేల పోస్టు కార్డులు పంపించే ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, ఈ పోరాటం భద్రాచలం పట్టణ మనుగడ కోసం జరిగే పోరాటమని పట్టణ ప్రముఖులు, సేవా తత్పరులు, ఐటీసీ పీఎస్పీడీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాకాల దుర్గా ప్రసాద్ అన్నారు. సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధాని మోడీకి పదివేల పోస్టుకార్డులు ఉద్యమం రెండవ రోజైన ఆదివారం ఈ కార్యక్రమంను పాకాల ప్రారంభించారు. బి.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం పట్టణ అభివృద్ధి కోసం జరిగే ఈ ఉద్యమంలో కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఐదు గ్రామ పంచాయతీలు కలపటం, సారపాక వరకు రైల్వే లైను పొడిగించటం, భద్రాచలం దేవస్థానాన్ని రామాయణం సర్క్యూట్లో కలపటం, న్యాయమైన డిమాండ్లుగా ఉన్నాయని ఈ సమస్యలపట్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమం చేపట్టిన పార్టీ పట్టణ కమిటీకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు ఎన్.నాగ రాజు, మాజీ ఎంపీటీసీ చేగొండి శ్రీనివాస్, జి జ్యోతి, యస్ భూపేంద్ర, సీనియర్ నాయకులు ఎన్.వి.ఎస్ నారాయణ, శాఖ కార్యదర్శి అధికారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.