Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
పమ్మి గ్రామంలో అధికారులతో అంబేద్కర్ విగ్రహాన్ని తాళ్లతో కట్టి మృతదేహంలా పక్కకు పడేసి అవమాన పరచిన జెడ్పీ చైర్మెన్ లింగాల కమలరాజ్ తన పదవికి రాజీనామా చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పి) జిల్లా నాయకులు పగిడికత్తుల ఈదయ్య విమర్శించారు. మండల పరిధిలో పమ్మి గ్రామంలో సోమవారం జరిగిన ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యస్.సి నియోజకవర్గం పేరుకు మాత్రమేనని వారికి వారి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. వారి నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేసి తొలగించిన తహసీల్దార్, ఎస్ఐల చర్యలపై లింగాల, భట్టి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల రాజ్ బాధ్యత వహించి అంబేద్కర్ విగ్రహాన్ని, అధికార లాంఛనాలతో పమ్మి గ్రామంలో ఏర్పాటు చేయాలని, లేనియెడల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మందకష్ణ మాదిగ ఆదేశాల మేరకు భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు ఆవుల శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంఎస్పి జిల్లా నాయకులు ఆనందరావు మాదిగ, కొలికపొంగు వెంకట్రావు మాదిగ, నాగేశ్వరరావు మాదిగ పాల్గొన్నారు.