Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దళితబంధు, పరిహారం కోసం
మంత్రులపై వత్తిడి తెస్తాం
అ విలేకర్ల సమావేశంలో వామపక్ష, విపక్ష
పార్టీల జిల్లా నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
తిప్పనపల్లి ప్రమాద మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయకుంటే ప్రత్యక్ష ఆందోలనకు పూనుకుంటామని అఖిలపక్ష రాజకీయ పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్లో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో జాక్ నాయకులు మాట్లాడారు. తిప్పనపల్లి జాతీయ రహదారిలో ప్రమాదం జరిగి పన్నెండు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం విచారకరమన్నారు. సుజాత నగర్ మండలం దళితకాలనీకి చెందిన నలుగురు దళిత మహిళా వ్యవసాయ కూలీలు మృత్యు వాతప డ్డారని, మరో పది మంది కూలీలు గాయాలపాలై చికిత్స పొందుతున్నారన్నారు. మగ్గురు కూలీలు అవయవాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నార న్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రులు జిల్లా పర్యటన చేసినప్పటికి బాధితులను పరామర్శించ కుండానే వెనుదిరగడం దళిత పేదల పట్ల వారికున్న ప్రేమ ఏపాటిదో స్పష్టమవుతోందన్నారు. సత్తుపల్లి నుంచి కొత్తగూడెంకు ప్రతీ రోజు వందలాది సింగరేణి టిప్పర్లు బొగ్గు రవాణా చేస్తున్నాయని, అధికలోడు, అతివేగం, నిర్లక్ష్యంతో రవాణా జరుగుతున్నప్పటికి పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని, ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యమేనన్నారు. నిరుపేద దళిత బాదితుల పట్ల పాలకులు వివక్షత ప్రదర్శిస్తున్నారని, యాదాద్రి భునగిరి, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన ప్రమాద ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించిన ప్రభుత్వం, దళిత కాలనీ మృతులపట్ల ఎందుకు వివక్షత ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. ఇది కేవలం జిల్లా మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల వైఫల్యమేనని విమర్శించారు. బాదితులకు న్యాయం చేయాలని అఖిలపక్షం ఆద్వర్యంలో సంబంధిత మంత్రులను కలిసి వినతిపత్రం సమర్పించి న్యాయం కోసం డిమాండ్ చేస్తామని, స్పందించని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన తప్పదని హెచ్చరించారు. ప్రమాద బాదితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కలిసిన సందర్భంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పట్ల కలెక్టర్ అనుదీప్ ప్రవర్తించిన తీరు సరికాదని, నిస్వార్ధంగా ప్రజల కోసం పనిచేసే ప్రజా నాయకులను పాలనా యంత్రాంగం ఆదరించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు, టిజెఎస్ జిల్లా నాయకులు మల్లెల రామనాధం, న్యూడెమోక్రసి నాయకులు, ఎల్.విశ్వనాధం, మాచర్ల సత్యం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో జేఏసి నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, జాటోతు కృష్ణ, లిక్కి బాలరాజు, వై.శ్రీనివాసరెడ్డి, కంచర్ల జమలయ్య, కందగట్ల సురేందర్, నాయిని రాజు, పి.సతీష్, దైవాదీనం, భరత్, వూక్లా, టిజెఎస్ జిల్లా నాయకులు భూక్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.