Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆ ఐదు జీపీలే కాదు ముంపు
మండలాలు కూడా ఇవ్వండి
అ 10న బంద్, 11న సరిహద్దుల
దిగ్బంధనం, వంటా వార్పు
అ అఖిలపక్ష సమావేశంలో నేతలు
అ అంబేద్కర్ సెంటర్లో మానవహారం
నవతెలంగాణ-భద్రాచలం
పాలకులకు చిత్తశుద్ధి లేదని, ఐదు గ్రామ పంచాయతీలే కాదు ముంపు మండలాలు కూడా ఇవ్వాలని, భద్రాచలం ప్రాంతాన్ని కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమేనని భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య స్పష్టం చేశారు. సీపీఐ కార్యాల యంలో సోమవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, సీపీఐ(ఎం), టీడీపీ, న్యూడెమోక్రసీ, మహాజన సోషలిస్టు పార్టీ, ప్రజా సంఘాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదెం మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలోనే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఆ సమస్యను పరిష్కరించాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో క్రమక్రమం గా భద్రాచలం ప్రాంతం శూన్యంలోకి నెట్టివేయబడు తోందని ఆయన అన్నారు. భద్రాచలం మండలం లోని గ్రామాలు ఆంధ్రాలో విలీనం చేయడం ద్వారా ఇక్కడ చెత్త పోసేందుకు కూడా జానెడు జాగా లేకపోవడం దారుణ మన్నారు. పట్టణానికి అనుసం ధానంగా ఉండే ఎటపాక, పిచ్చికలపాడు, కన్నాయి గూడెం, పురుషోత్తపట్నం, గుండాల పంచాయ తీలను తెలంగాణకు ఇవ్వాలని ఆయన అన్నారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు కొద్ది సేపు చర్చలు జరుపుకుంటే సమస్య ఇట్టే పరిష్కారం అవుతుందని తెలిపారు. అవసరమైతే వారి చర్చల్లో ఐదు పంచాయతీలే కాకుండా ముంపు మండలాలను కూడా తెలంగాణకు ఇస్తామన్నా తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. ఇక్కడి సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రికి విన్నవించుకున్నా ప్రయోజనం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతం పై సవతితల్లి ప్రేమను చూపుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తెరిగి పార్లమెంట్ సమావేశాల్లో ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ మాట్లాడుతూ పోలవరం నిర్మాణ సమయంలోనే ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఉద్యమాలు చేశామని ఆయన అన్నారు. ఆ రోజుల్లో తమ నాయకులపై కాల్పులు జరిపారని, ఆ కేసు వ్యవహారంలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఆయన అన్నారు. ఇక్కడి కార్యాలయాలు వేర్వేరు ప్రాంతాలకు తరలి పోతున్నాయని, కావాలనే ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ఉత్తరప్రదేశ్లో ఓట్లు కావాలి కాబట్టి రామజన్మభూమి అయోధ్యపై దృష్టి పెట్టి, దక్షిణ అయోధ్యను చులకన భావంతో చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం విశిష్టతకు భంగం వాటిల్లే పనులు చేస్తుందని, రాముని పెండ్లికి కనీసం ఈ ముఖ్యమంత్రికి వచ్చే తీరిక లేకపోవడం ఈ రాష్ట్రం చేసుకున్న పాపం అని అన్నారు. యాదాద్రికి ధీటుగా భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి మాటలతో కేసీఆర్ కాలం వెళ్లదీస్తున్నారని, రాముల వారి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పిన మాటలను నేటికి కూడా నెరవేర్చుకోవడం శోచనీయమన్నారు. అదేవిధంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ ఈ ప్రాంతంపై అవగాహన లేని పాలకులు క్షేత్రస్థాయిలో పని చేయకుండా తలాతోకా లేకుండా రాష్ట్రాన్ని విడదీశారని ఆయన అన్నారు.
బంద్, దిగ్బంధనం, వంటా-వార్పు
భద్రాచలం ప్రాంతాన్ని ఆదుకునేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ గురువారం భద్రాచలంతో పాటు దుమ్ముగూడెం, చర్ల మండలాలు ఆంధ్రలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీల బందుకు పిలుపునిచ్చారు. వ్యాపార వర్గాలు, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. అదేవిధంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 11వ తేదీన సరిహద్దులను దిగ్బంధనం చేయడంతో పాటు భద్రాచలం, ఏపీలో విలీనమైన ఎటపాక కన్నాయిగూడెంలలో వంటావార్పు నిర్వహిం చనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా కదలిరావాలని అఖిలపక్షం నాయకులు కోరారు.
అంబేద్కర్ సెంటర్లో మానవహారం :
అఖిల పక్ష సమావేశం అనంతరం నిర్వహించిన మానవ హారానికి విశేష స్పందన లభించింది. సుమారు 200 మంది స్థానిక అంబేద్కర్ సెంటర్లో వలయంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఐదు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలపాలని, రైల్వే లైను ఏర్పాటు చేయాలని, భద్రాద్రి అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, అకోజు సునీల్ కుమార్, తమ్ముళ్ల వెంకటేశ్వరరావు, బల్ల సాయి కుమార్, బండారు శరత్ బాబు, భీమవరపు వెంకటరెడ్డి, బుడగం శ్రీనివాస్, తాండ్ర నరసింహారావు, బొలిశెట్టి రంగారావు, సరెల్ల నరేష్, భోగాల శ్రీనివాసరెడ్డి, కెచ్చల కల్పన, కుమారి తదితరులు పాల్గొన్నారు.