Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
చీడపీడల నుంచి పంటలు రక్షించుకునేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులు కోతుల బెడదతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఏటా రెండు, మూడు ఈతలు ఈనే వానరులు లక్షలాదిగా తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. ఊళ్లలో ఇళ్లలోకి దూరి తమ చేష్టలతో ఇబ్బంది పెడుతున్న కోతులు... పలుచోట్ల మనుషులపై దాడులూ చేస్తున్నాయి. ఇక పంట పొలాల్లోనైతే బీభత్సం సృష్టిస్తున్నాయి. మూకుమ్మడిగా సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ కోతులపై ప్రత్యేకంగా సర్వే చేపట్టింది. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో 2,412 సమూహాలు, 2,64,522 కోతులు సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగా కోతుల నియంత్రణకు చర్యలు తీసుకోనున్నారు. ఎప్పుడు ఇది ఆచరణలోకి వస్తుందా? అని రైతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
పంటల్లో కోతుల బీభత్సం
పంటచేలల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేరుశనగ, మొక్కజన్న, వరి, పెసర, కంది, కూరగాయ పంటలతో పాటు పత్తి కాయలను కూడా తెంపి పడేస్తున్నాయి. పంటచేల ఇగుర్లను తుంచి తింటున్నాయి. చివరకు మిరప తోటల్లోనూ కొమ్మలను విరగ్గొడుతున్నాయని రైతులు వాపోతున్నారు. మామిడి తోటల్లో చెట్ల కొమ్మలపై విచ్చలవిడిగా గెంతులు వేస్తుండటంతో అరకొరగా పూసిన మామిడి పూత నేలరాలుతోంది. మొక్కజన్న కంకి పోసుకుంటున్న దశ నుంచి విరిచేస్తున్నాయి. వేరుశనగ విత్తనాలు వేసిన సమయంలో నేలను పెకిలించి గింజలు తింటున్నాయి. లేత మొక్కలను తొలగించి కొరికి పడవేస్తున్నాయి. కాయలు కాశాక వేర్లతో సహా తొలగిస్తున్నాయి. వరి కంకులను సైతం పీల్చిపిప్పి చేస్తున్నాయి. ముఖ్యంగా పంట చేను పరిసరాల్లో చెట్లు అధికంగా ఉంటే కోతుల పంట పండినట్టే. అటువంటి చోట పంటలు వేసే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వం యాసంగి వరి కొనమంటుండటంతో రైతులు ఆరుతడి పంటలు వేద్దామని ఆశించినా...కోతుల బెడదతో బెంబేలెత్తి పలువురు సాగుభూమిని ఖాళీగా ఉంచారు.
పంట రక్షణకు పడరాని పాట్లు
కోతుల నుంచి పంటలు రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రూ.వేలు ఖర్చు చేసి చేను చుట్టూ చేపల వలను అమర్చుతున్నారు. పంట చేలలో కొండముచ్చుల ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు. పంట చుట్టూ చీరలు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు వేరుశనగ రైతులు పంట గింజ పోసుకునే దశలో నెలకు రూ.5,000 వరకు ఇచ్చి ప్రత్యేకంగా మనిషిని నియమిస్తున్నారు. కోతుల కోసం కొందరు ప్రత్యేకంగా కుక్కలను సైతం పెంచుకుంటున్నారు. మరికొందరు వేల రూపాయలు వెచ్చించి కొండముచ్చలను సైతం పెంచుతున్నారు. రైతులు సంఘటితమై కొండముచ్చలను సైతం తెప్పిస్తున్నారు. కొన్ని కోతులు కొండముచ్చులపైనా దాడి చేస్తుండటంతో గత్యంతరం లేక కోతులు పట్టేవారిని సైతం రప్పిస్తున్నారు. కోతిని పట్టుకుంటే ఒక్కోదానికి రూ.100కు పైన చెల్లిస్తున్నారు. ఇలా వందలాది కోతులను నిష్ణాతులు పట్టుకుని అడవుల్లో వదిలేస్తున్నా చుట్టుపక్కల ఊళ్లలో నుంచి వచ్చిన కోతులు మళ్లీ పంటలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోతుల కుటుంబ నియంత్రణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కోతుల కుటుంబ నియంత్రణ
కోతులతో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వానర కుటుంబ నియంత్రణ చేపట్టాలని నిర్ణయించింది. సర్వేలో జిల్లాలో ఎన్ని కోతులు న్నాయి? కోతులు సమూహంగా తిరుగుతున్నాయా? కోతుల వల్ల ఎంత పంటనష్టం జరుగుతోంది? కోతులు ఎక్కువగా ఏయే ప్రాంతాల్లో ఉంటున్నాయి? గ్రామస్తులు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు? తదితర ప్రశ్నల ఆధారంగా సర్వే నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా కోతులున్నాయని సర్వేలో తేలింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో దీన్ని నెలకొ ల్పింది. మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటుకు సమాయత్తం అవు తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అవలంబిస్తున్న చర్యలను అధ్యయనం చేసేందుకు సిద్ధ మైంది. పల్లె ప్రకృతివనాలు, అడవులు, రోడ్ల వెంబడి పండ్ల మొక్కలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.