Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఇటీవల అగ్ని ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఇల్లు కోల్పోయిన బాధితుల కుటుంబాలను మధిర శాసన సభ్యులు సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోమవారం పరామర్శించారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం హరిజనవాడ గ్రామంలో గత శనివారం కోట ప్రసాద్, కోట కృష్ణమూర్తికి సంబంధించిన రెండు ఇల్లు అగ్ని ప్రమాదంలో ప్రమాదవశాత్తు కాలిపోయిన సంగతి పాఠకులకు విధితమే. ఇల్లు కాలిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన భట్టి విక్రమార్క బాధితులతో మాట్లాడారు. ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రెండు పడకల ఇల్లు మంజూరు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ కు సూచించారు. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనావేసి పూర్తి నివేదికను అందించాలని ఎర్రుపాలెం తహశీల్దార్ తిరుమల చారిని ఆదేశించారు.
భీమవరం ఎస్సీ కాలనీలో తాగు నీటి సమస్య ను భట్టి దృష్టికి గ్రామస్తులు తీసుకొని రాగా వెంటనే మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమి రెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, సొసైటీ ఉపాధ్యక్షుడు కడియం శ్రీనివాసరావు, శీలం శ్రీనివాస్ రెడ్డి, అనుమోలు వెంకట కృష్ణారావు, స్థానిక సర్పంచ్ వజ్రమ్మ, దేవరకొండ శ్రీను, రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.