Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డ్రగ్స్ రహిత మండలంగా మారుద్దాం
అ ఇల్లందు డిఎస్పీ రవీందర్ రెడ్డి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండలంలో గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగ నివారణకు ప్రజలందరూ కృషి చేయాలని తద్వారా ఆళ్ళపల్లిని డ్రగ్స్ రహిత మండలంగా మారుద్దామని ఇల్లందు డిఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పోలీసుల ఆధ్వర్యంలో ఆళ్ళపల్లి మండల కేంద్రము పోలీస్ స్టేషన్ లో సోమవారం స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ అద్యక్షతన యువత, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలకు గంజాయి (డ్రగ్స్) నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డిఎస్పీ హాజరై మాట్లాడారు. మండలంలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ సాగుకు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. పోడు, పట్టా భూముల్లో గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, గంజాయి సాగు చేసే భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పేర్కొన్నారు. మండలంలో గ్రామస్థాయిలో దీనిపై అవగాహన కల్పిస్తామని, ఇందుకు మండల ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామల సర్పంచ్ల సహకారంతో పోలీస్ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి గంజాయి సాగుతో నెలకొనే ప్రమాదంపై ప్రజలకు, యువతకు వివరిస్తామని తెలిపారు. ఇప్పటికే మండలంలో కాచనపల్లి గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న రైతును గుర్తించి కేసు నమోదు చేశామని, అలాగే మండలంలో కొందరు యువకుల పేర్లు పోలీస్ శాఖ దృష్టికి వచ్చాయని, అటువంటి వారు మాదకద్రవ్యాల వాడకాన్ని ఇంతటితో వదిలి, తమ ఉజ్వల భవిష్యత్తు కోసం సన్మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం టేకులపల్లి సీఐ బి.రాజు మాట్లాడుతూ.. 13 నుంచి 21 సంవత్సరాల నడుమ ఉన్న యువతే ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ సేవిస్తున్నారని, యుక్త వయస్సులో ఉన్న యువతపై వారి తల్లిదండ్రులే ప్రత్యేక దృష్టి సారించాలని, తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులు చేయి దాటక ముందే జాగ్రత్త పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎక్సైజ్ శాఖ సీఐ రాజశేఖర్, ఎస్సై లు సమీఉల్లాఖాన్, గోవర్ధన్, స్థానిక ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, కోఆపరేటివ్ ఛైర్మన్ గొగ్గెల రామయ్య, డైరెక్టర్ సయ్యద్ హఫీజ్, సర్పంచ్ లు నరసింహారావు, వెంకట నారాయణ, కోటేశ్వరరావు, ప్రముఖ వ్యాపారస్తులు పాల్గొన్నారు.