Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఫిబ్రవరి 21న సింగరేణి హెడ్డాఫీస్ ముందు దీక్ష
అ విలేకర్ల సమావేశంలో కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
బొగ్గు బ్లాకుల జోలికి వస్తే మరో తెలంగాణ ఉద్యమం జరుగుతుందని, బొగ్గునుల ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేస్తామని, రాష్ట్ర సంపదను ఆదానీ...అంబానీలకు కట్టబెట్టే చర్యలను తిప్పికొడతామని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష ఆందోళనలకు పూనుకోవాలని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలను కేంద్రంలోని మోడీ సర్కార్ వేగవంతం చేసిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బొగ్గుగనుల ప్రైవేటీకరణకు స్వస్థి చెప్పిన కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కోల్ దోపిడికి తెరలేపిందన్నారు. ఇంక్లైన్ పేరుతో పిలుస్తున్న బొగ్గు గనులు ఇకమీదట ఆదానీ, అంబానీ గనులుగా పేరు మారే ప్రమాదం ఏర్పడే ప్రమదం పొంచి ఉందన్నారు. బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 21న వెయ్యి మందితో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టబోతున్నామని వెల్లడించారు. కేంద్రం వెనక్కు తగ్గని పక్షంలో దీక్షా వేదిక నుంచి కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని పేర్కొన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో వర్కర్స్ యూనియన్ నాయకులు జి.వీరస్వామి, జె.గట్టయ్య, చందర్ రావు, సిపిఐ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.